రేపు పాలేరు... అరెంపుల క్లస్టర్లలో 'ప్రజా దర్బార్'
ఖమ్మం,(విజయక్రాంతి): ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే చేరాలనే సంకల్పంతో, పాలేరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సరికొత్త బాటలు వేస్తున్నారు. సామాన్యులు తమ చిన్నపాటి అవసరాల కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగకూడదన్న ధ్యేయంతో చేపట్టిన 'ప్రజా దర్బార్'(Praja Darbar) కార్యక్రమం మంగళవారం రెండు ప్రధాన కేంద్రాల్లో జరగనుంది. కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన ప్రజల కోసం అధికారులు క్షేత్రస్థాయికి రానున్నారు.
కూసుమంచి మండలం పాలేరులో ఉదయం 8 గంటల నుంచి.. మంగళవారం ఉదయం 8:00 గంటలకు కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ఆవరణలో ప్రజా దర్బార్ ప్రారంభం కానుంది. ఈ కేంద్రానికి పాలేరు, నాయకన్ గూడెం, భగవత్వీడు తండా, మంగళ్ తండా, కొత్తూరు, నర్సింహులగూడెం, సంధ్యా తండా, లాల్ సింగ్ తండా, గైగోల్లపల్లి, బోడియా తండా, చౌటపల్లి, ఎర్రగడ్డ తండా, గురవాయిగూడెం సహా 13 గ్రామ పంచాయతీల ప్రజలు హాజరుకావచ్చు.
వేదికపైనే పరిష్కారం..
జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్ సహా అన్ని శాఖల అధికారులు ఈ వేదికలపై అందుబాటులో ఉంటారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను తక్షణమే పరిశీలించి, పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. "ప్రతి విన్నపాన్ని నేరుగా పర్యవేక్షిస్తాం.. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం" అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సంబంధిత గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కోరారు.






