సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి
బడంగ్ పేట్,(విజయక్రాంతి): అర్హులైన ఏ ఒక్కరు తమ ఓటు కోల్పోకూడదని, అందుకు ప్రతి ఒక్కరి ఎస్ఐఆర్ ఫాం ను తప్పకుండా నింపి ఇవ్వాలని ఈఆర్ఓ ఎన్.జగదీశ్వర్ రెడ్డి కోరారు. శనివారం బడంగ్ పేట్ సర్కిల్ కార్యాలయంలో డీసీ, ఏఈఆర్ఓ వి.సమ్మయ్య, డిటియు నరేష్ తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితాను సంపూర్ణంగా, ఖచ్చితంగా రూపొందించే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
అర్హులైన ఏ ఒకరు తమ ఓటు కోల్పోకూడదని, అందుకు ప్రతి ఒక్కరు బిఎల్ఓలు ఇచ్చిన ఫాంను నింపి ఇవ్వాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బడంగ్‌పేట్ ఏఈఆర్ఓ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని పూరించడంలో ఏవైనా సందేహాలు ఉన్నా, లేదా 2002 నాటి ఓటరు జాబితాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సి వచ్చిన ఆయా హెల్ప్‌డెస్క్‌లలో అధికారులు, వాలంటీర్లు అవసరమైన సహాయాన్ని అందిస్తారని చెప్పారు.
అర్హులైన ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా పూరించి, సంబంధిత పోలింగ్ బూత్ స్థాయి అధికారి బిఎల్ఓకి జూలై 24లోగా తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. గడువులోగా ఫారం సమర్పించని పక్షంలో, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వారి ఓటరు నమోదుపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఓటరు నమోదు చేసుకునే ప్రక్రియలో వివిధ పార్టీల ప్రతినిధులు, సోషల్ సర్వీస్ ప్రతినిధులు, ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.






