ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి
జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రజాప్రతినిధుల వినతి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రత్యేక వాహనాలను మంజూరు చేయాలని జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మున్సిపల్ ప్రజాప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 2024 ఫిబ్రవరి 2న ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత పట్టణ జనాభా, విస్తీర్ణం గణనీయంగా పెరిగాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పారిశుద్ధ్య వాహనాలు అవసరాలకు సరిపోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాల సాధనతో పాటు పట్టణ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలంటే అదనపు వాహనాలు అత్యవసరమని తెలిపారు.
మున్సిపాలిటీకి 10 స్వచ్ఛ ఆటోలు, 3 ట్రాక్టర్లు, 1 వైకుంఠ రథం, 1 జనాజా క్యారియర్, 1 జేసీబీ, 1 బ్లేడ్ ట్రాక్టర్, 1 ఎలక్ట్రికల్ ల్యాడర్ వాహనం మంజూరు చేయాలని కోరారు. ఈ వాహనాలు అందుబాటులోకి వస్తే ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు కాలువల శుభ్రత, రోడ్ల నిర్వహణ, వీధి దీపాల మరమ్మతు పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, కౌన్సిలర్లు రాపర్తి కార్తిక్, స్వప్న రాణి సాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం జావిద్, శివ ప్రసాద్, నిఖిల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






