3 June, 2026 | 9:39 PM

సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష

03-06-2026 08:21 PM

నాగర్ కర్నూల్/బిజినపల్లి/కొల్లాపూర్ రూరల్,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నార్లాపూర్‌లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తో కలిసి ప్యాకేజీ-1 పంప్‌హౌస్, ప్యాకేజీ-2 డెలివరీ సిస్టమ్, ప్యాకేజీ-3 కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. భద్రత, హెలిప్యాడ్, సమావేశ వేదిక, రవాణా, పారిశుధ్య ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, జూన్ 4న సోమశిలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ రైతాంగానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం శ్రీ వెంకటాద్రి రిజర్వాయర్, కుమ్మెర పంప్‌హౌస్ ప్రాంతాల్లో కూడా కలెక్టర్, ఎస్పీలు పర్యటించి ముఖ్యమంత్రి రాకకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు.