3 June, 2026 | 9:39 PM

కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

03-06-2026 08:18 PM

- పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిని (ఎన్ హెచ్-563) 4 వరుసలుగా (4-లైన్లు గా) విస్తరించేందుకు కేంద్ర క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే నిర్మాణానికి  కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే నిర్మాణం చేపట్టడం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. బండి సంజయ్ కృషితోనే నేడు కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి సాకారం అవుతుందన్నారు.  ప్రధానంగా (ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల , జగిత్యాల-కరీంనగర్  కలిపి మొత్తం 7,597.16 కోట్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఇందులో కేవలం జగిత్యాల-కరీంనగర్ సెక్షన్ కోసమే 2,395 కోట్లు ఖర్చు చేయనున్నారని  తెలిపారు.

దాదాపు 58 కిలోమీటర్ల  పొడవుతో జగిత్యాల - కరీంనగర్ సెక్షన్ను(  బి ఓ టి) పద్ధతిలో విస్తరించనున్నారని తెలిపారు. ఇందులో భారీ ట్రాఫిక్ ఉండే జనాభా ప్రాంతాలను తప్పిస్తూ కొత్తగా 34.96 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లు కూడా నిర్మించనున్నారని ,  ఈ హైవేపై వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారనీ తెలిపారు. ముఖ్యంగా ఈ 4 లేన్ల రోడ్డు అందుబాటులోకి వస్తే జగిత్యాల - కరీంనగర్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 45 నిమిషాల పాటు కలిసి వస్తుందని,  ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోవడం వల్ల కరీంనగర్, జగిత్యాల జిల్లాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి, ముఖ్యంగా స్థానిక వ్యాపారాలకు, రైతులకు తమ ఉత్పత్తులను రవాణా చేయడానికి ఎంతో మేలు చేకూరనుందన్నారు.