ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – ఉచిత వైద్య శిబిరాలు ప్రారంభం
సుజాతనగర్ పీహెచ్‌సీలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్ వైద్యులు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరాలను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు ఈ వైద్య శిబిరాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ఎక్కువ మంది ప్రజలు శిబిరాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా రక్తపరీక్షలు, కీళ్ల సమస్యలకు సంబంధించిన పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు వంటి ఆరోగ్య పరీక్షలను ప్రజలు చేయించుకొని తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు.
అవసరమైతే రోగులను కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసి అక్కడ అందుబాటులో ఉన్న అన్ని ప్రధాన పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్కానింగ్, ఎక్స్-రే వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నందున అవసరమైన వారికి అక్కడ పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ... ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ఉచిత వైద్య శిబిరాలను దశల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సుజాతనగర్, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రతిరోజు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చొప్పున ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు.




