కార్మికులకు అండగా ఎమ్మెల్యే భరోసా
హనుమకొండ,(విజయక్రాంతి): అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలు పాల్గొని కార్మిక జెండా ఎగురవేశారు. మొదటగా ఆర్టీసీ కార్మికులు ఆధ్వర్యంలో హనుమకొండ డిపో-1 లో ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్నారు. తరువాత హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఎన్టియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకలలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజిజ్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన మే డే వేడుకలో హాజరై జెండా ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వేగంగా స్పందించి మంత్రివర్గ సమావేశం ద్వారా పరిష్కార చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు.నియోజకవర్గంలోని ప్రతి కార్మికుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన, కష్టకాలంలో ఒక సోదరుడిలా పక్కన ఉంటానన్నారు. కాజీపేట ప్రాంత కార్మికుల కోసం భవన నిర్మాణానికి ఇప్పటికే స్థలం కేటాయించినట్లు తెలిపారు.






