1 May, 2026 | 9:27 PM

గ్రామీణ విద్యార్థులకు పట్టణ స్థాయి విద్యా సదుపాయాలు,

01-05-2026 07:58 PM

- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

కల్వకుర్తి: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణస్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని వంగూరు మండలంలో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ పనులను రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి తో కలిసి క్షేత్రస్థాయిలో పనుల పరిశీలించారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ భవిష్యత్తులో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్య అందించే కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయని, నిర్మాణ పనుల నాణ్యత, వేగం, ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగుతున్నాయా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తరగతి గదులు, లైబ్రరీ భవనాలు, సైన్స్ , కంప్యూటర్ ప్రయోగశాలలు, విద్యార్థుల కోసం ప్రత్యేక సదుపాయాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, క్రీడా మైదానాలు తదితర మౌలిక వసతుల నిర్మాణాలను సమీక్షించారు.

 తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తోందని తెలిపారు. విద్యార్థుల విద్యకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు నిర్వహించాలని తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేయాలని, ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక విద్యా వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం అందుబాటులో ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని , అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ మోడల్ పబ్లిక్ స్కూల్స్‌లో విశాలమైన తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, ఆధునిక ప్రయోగశాలలు, సమృద్ధిగా పుస్తకాలతో కూడిన గ్రంథాలయాలు, విద్యార్థుల శారీరక వికాసానికి అనువైన క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

గ్రామీణ విద్యార్థులు కూడా పోటీ ప్రపంచానికి తగిన విధంగా తయారవ్వడానికి ఈ పాఠశాలలు కీలకంగా మారతాయని డాక్టర్ ఆకునూరి మురళి సూచించారు.   భవన నిర్మాణానికి ఇసుక సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా జిల్లా యంత్రాంగం మైనింగ్ శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తోందన్నారు. పాఠశాల నిర్మాణానికి అవసరమైనంత ఇసుకను ఎప్పటికప్పుడు సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, నిర్మాణ పనులు గడువులోపు పూర్తి అయ్యేలా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేస్తాయని కలెక్టర్ తెలిపారు.

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పాఠశాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, నిర్మాణ పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.