డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 14 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లాలో గురువారం ఘోర బస్సు ప్రమాదం(Markapuram Bus Accident) జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ను హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో 14 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జరిపిన ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు ప్రమాదం జరిగినట్లు తేలింది. మలుపు తిరుగుతున్నప్పుడు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, ఆ క్రమంలో టిప్పర్‌ను ఢీకొట్టినట్లు బాధితులు తెలిపారు. బస్సులో మంటలు చెలరేగిన ప్రమాదంలో 10 మంది మరణించగా, మృతుల సంఖ్య 14కు పెరిగింది. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయాయి.
క్షతగాత్రులు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. రాయవరం సమీపంలో ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. మృతుల్లో మహిళలు, చిన్నారులున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే బస్సులోంచి 10 మంది ప్రయాణికులు దిగిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు.
మృతులను కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. నిన్న సాయంత్రం 5.30 గంటలకు జగిత్యాల నుంచి బస్సు పామూరుకు బయల్దేరింది. టిప్పర్ చీమకుర్తి నుంచి కంకర్ లోడ్ తో మార్కాపురం వైపు ప్రయాణిస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలను బస్సు నుంచి ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీశారు.
ఇప్పటివరకు 14 మృతదేహాలను బస్సులోంచి బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. బస్సు కండిషన్ సరిగా లేదని డ్రైవర్ తో ముందుగానే ప్రయాణికులు చెప్పినట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం వద్ద గంటల సేపు నిలిపివేసి సిబ్బంది బస్సుకు మర మత్తులు చేశారు. కాగా, అధికారులు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. బాధితులను గుర్తించడానికి, వారి బంధువుల వివరాలను సేకరించడానికి సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే వారి బంధువులకు సమాచారం అందించనున్నారు.






