26 March, 2026 | 4:36 AM

మహిళలపై సీఎంకు వివక్ష!

26-03-2026 02:02 AM
  1. చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తే మీకొచ్చిన ఇబ్బందేమిటి?
  2. దేశాన్ని విభజించాలని చూస్తున్నారా
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ‘సీఎం గారు ఎందుకీ వివక్ష వ్యాఖ్యలు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి డీలిమిటేషన్‌పై చేసిన వ్యాఖ్యలపై బుధవారం బండి సంజయ్ స్పందించారు.

అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాదికి జరిగే నష్టమేంది? అని నిలదీశారు. తెలంగాణలో 50 శాతం సీట్లను పెంచొద్దని చెపుతున్నారా అని పేర్కొన్నారు. ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలి కాచుకుంటారని, దేశాన్ని విభజించాలని చూస్తున్నారా అని మండిపడ్డారు. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే వణుకు వారిలో మొదలైందని తెలిపారు.

ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ పాచిక తమిళనాడు, కేరళలో పారడం లేదని అర్ధమైందన్నారు. అందుకే దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని కొత్త డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కాపీలను చింపిన ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలతో అంటకాగుతున్నారని, మీరెన్ని కుట్రలు చేసినా, విభజన రాజకీయాలు చేసినా మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని పేర్కొన్నారు. 

పెట్రోల్ కొరతపై వదంతులను నమ్మొద్దు

పెట్రోలు, డీజిల్ కొరత లేదని, ఆయిల్ సంస్థల వద్ద అవసరానికి సరిపడా నిల్వలున్నాయని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఆయిల్ నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, వదంతలు నమ్మి అవసరానికి మించి పెట్రోలు కొనడంవల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదముందన్నారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంవల్ల కొన్ని పెట్రోలు బంకుల్లో తాత్కాలిక స్టాక్ కొరత ఏర్పడుతోందని తెలిపారు. ఇదే అదనుగా కొంతమంది బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు.