13 May, 2026 | 2:11 AM

అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్ట్ డంప్ లభ్యం

13-05-2026 01:07 AM

1.64 కోట్లు నగదు, ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్ స్వాధీనం

చర్ల, మే 12 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టుల ఆయుధాల డంప్, పెద్ద మొత్తంలో నగదును భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఒక పెద్ద మావోయిస్టు డంప్‌ను కనిపెట్టాయి. ఈ క్రమం లో ఏకంగా రూ. 1.64 కోట్ల నగదుతో పాటు భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతకొద్ది రోజులుగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్పీ), రాష్ట్ర పోలీసు బలగాలు సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. అబూజ్మడ్ అడవుల్లో మా వోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.

ఈ కూంబింగ్‌లో బయటపడిన డంప్‌లో కేవలం నగదు మాత్ర మే కాకుండా, భారీ ఆయుధ సామగ్రి లభించింది. రాకెట్ లాంఛర్లు, అత్యాధునిక ఏకే-47 గన్‌లు, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, భారీగా విస్ఫోటక సామగ్రి, బాంబుల తయారీకి ఉపయోగించే పరికరాలు,మావోయిస్టుల సాహిత్యం, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి.మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో ఈ నగదు స్వాధీనం అత్యంత కీలకమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మావోయిస్టుల వ్యూహాలను చిత్తు చేస్తూ వారి ప్రధాన స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతోంది.