27 July, 2026 | 3:54 AM

వర్షాలు లేక ఎడారిలా మారిన మానేరు నది

27-07-2026 12:00 AM
  1. పెద్దపల్లి జిల్లాలో ఉప్పొంగిన చోట ఎండిపోయిన ప్రవాహం
  2. ఆందోళనలో మానేరు పరివాహ గ్రామాల రైతన్నలు
  3. బోర్లు ఎండిపోయి ఖరీఫ్ సాగుపై పడుతున్న తీవ్ర ప్రభావం

పెద్దపల్లి, ముత్తారం, జూలై 26 (విజయ క్రాంతి)పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లితాడిచెర్ల గ్రామాల మధ్య ప్రవహించే మానేరు నది వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు లేక వెలవెలబోతోంది. గత ఏడాది ఇదే సమయానికి ఉప్పొంగి ప్రవహించిన మానేరు నది, ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఎడారిని తలపిస్తోంది. నదిలో అక్కడక్కడా చిన్న చిన్న నీటి గుంటలు తప్ప ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో తీర ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో నిలిచిన వ్యవసాయ పనులు.. ఆకాశం వైపు ఆశగా అన్నదాతల చూపు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం నుంచి పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మీదుగా మానేరు నది ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం మండలాలను కలుపుతూ మంథని గోదావరి నది లో కలుస్తుంది. దీం తో మానేరు నది ఆధారంగా సాగయ్యే పం ట భూములకు నీరు అందక వ్యవసాయ ప నులు జిల్లాలో మందగించాయి. ఇప్పటికే ఖ రీఫ్ సీజన్ ప్రారంభమై విత్తనాలు వేసిన రై తులు, పంటలను కాపాడుకోవడానికి వర్షా ల కోసం ఆకాశం వైపు రైతులు దీనంగా ఎ దురుచూస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు సైతం దారుణంగా పడిపోయాయని, వేసిన బోరు బావులు కూడా ఎండిపోతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకృతి కరుణించకపోతే తీవ్ర నష్టాలే...

గతంలో ఉరకలెత్తిన నీటి ప్రవాహాల స్థానంలో ఇప్పుడు నది పొడవునా ఇసుక మేటలు, శ్మశాన నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లోనైనా విస్తారంగా వర్షాలు కురిసి మానేరు నది మళ్లీ జలకళ సంతరించుకోవాలని, పంటలు చేతికి వచ్చేలా ప్రకృతి కరుణించాలని రైతాంగం కోరుతోంది. వర్షాలు పడకపోతే ఈ ఖరీఫ్ సీజన్లో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.