17 April, 2026 | 4:06 AM

మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన

16-04-2026 04:14 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో అధికారులు మొక్కజొన్న పంట కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డ్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులు మాట్లాడుతూ దాదాపు ఐదు రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. అధికారులు గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత ఉందంటూ కుంటి సాకులు చెబుతూ తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా లారీల్లోకి ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో దళారులు గద్దల్లా వాలిపోయి తమ మొక్కజొన్నను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ ఒక్కో ఎకరాకు తక్కువ పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆన్లైన్ పోర్టల్ నమోదు, వ్యవసాయ శాఖ అనుమతి పత్రాలు, మార్క్‌ఫెడ్ వద్ద వేలిముద్రలు వంటి ప్రక్రియలతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. తీరా గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు.

వర్షపు చినుకు పడితే తమ కష్టార్జిత ధాన్యం పూర్తిగా వర్షంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లోనే మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అధికంగా మొక్కజొన్న ఉన్న గ్రామాలకు నేరుగా లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.