14 March, 2026 | 3:23 AM

మహాలక్ష్మిబకాయిలు.. 2,500 కోట్లపైనే!

14-03-2026 01:48 AM
  1. సబ్సిడీ చెల్లింపుల్లో ప్రతినెలా సుమారు 100 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత
  2. అంతకంతకూ పెరుగుతున్న మహిళల ఆక్యుపెన్సీ రేషియో
  3. బకాయిలు చెల్లించకుంటే ఆర్టీసీ వ్యవస్థ కుప్పకూలడం ఖాయమంటున్న కార్మికులు

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): పేరు గొప్ప.. ఊరు దిబ్బలా తయారయ్యింది రాష్ట్ర ప్రభుత్వం తీరు. ప్రజల్లో మహాలక్ష్మి పథకం గురించి ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బిల్లుల విషయంలో మాత్రం ఆ స్థాయిలో స్పందించడం లేదని ఆర్టీసీ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రజలు అడగకుండానే ప్రకటించిన మహాలక్ష్మి పథకంలో..

రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇలా మహి ళల ఉచితంగా ప్రయాణానికి సంబంధించిన టిక్కెట్ ధరను మాత్రం ప్రభు త్వం ఆర్టీసీకి చెల్లిస్తుందని మొదట్లో ఊదరగొట్టిన ప్రభుత్వం, మెల్లమెల్లగా మొత్తం బిల్లులను చెల్లించకుండా.. కోట్ల రూపాయలను బకాయిలుపెడుతూ వస్తోంది. దీనితో ఆర్టీసీ పరిస్థితి పెనంమీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారయ్యింది.

నెలా 100 కోట్ల వరకు తగ్గిస్తూ..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2023 డిసెంబర్ రెండోవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకాన్ని సర్కారు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చే సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ప్రయాణీకులపై ఒక సర్వే (ఓఆర్ రేషి యో) చేయించింది. దీని ప్రకారం.. ప్రతినెలా సుమారు రూ. 350 కోట్ల విలువైన మహిళా ప్రయాణాలు ఉం టాయని..

అందుకే ఆర్టీసీకి ప్రతి నెలా రూ. 350 కోట్లు ఈ పథకం కింద చెల్లిస్తామని ఘనంగా ప్రకటించింది. అయితే పూర్తి ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో, రాష్ట్రవ్యాప్తంగా మహిళా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనితో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 45 నుంచి 50 సీట్లుంటే, చాలా బస్సుల్లో 150కి మించి ప్రయాణీకులు వెళుతున్నట్టు అనేక సందర్భాల్లో స్పష్టమైంది. ప్ర యాణీకుల సంఖ్య పెరగడంతో, ఉచిత ప్రయాణాల విలువ ప్రతి నెలా సుమా రు రూ. 400 లకు చేరింది. పండుగలు, శుభకార్యాల సమయాల్లో రూ. 400 కోట్లను కూడా దాటుతోంది.

రూ. 2,500 కోట్ల బకాయిలు..

అయితే మహాలక్ష్మి పథకాన్ని ఘనంగా ప్రారంభించిన కాంగ్రెస్ సర్కారు.. కొంత కాలం పాటు మాత్ర మే ప్రతి నెలా రూ. 350 కోట్లను ఆర్టీసీకి ఇచ్చింది. అటు తరువాత, రూ. 350 కోట్లలో కోత విధిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపెడుతూ వస్తోంది.

సగటున ప్రతినెలా రూ. 270 నుంచి రూ. 300 కోట్ల వరకు మాత్రమే చెల్లిస్తోంది. ఇదే సమయంలో మహిళా ప్రయాణీకులకు ఇచ్చే జీరో టిక్కెట్ల విలువ రూ. 400 కోట్లకు చేరింది. దీనితో ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల్లో రూ. 100 కోట్ల వరకు కోత విధిస్తూ వస్తున్నారు. ఈ బకాయిలు కాస్త పెరిగి.. ఇప్పుడు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తం రూ. 2,500 కోట్లకు చేరడం గమనార్హం.

మరింతగా పెరుగుతున్న ఓఆర్..

ఇప్పటికే రూ. 2,500 కోట్ల బకాయిలు ఉన్న ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయకపోవడంతో.. ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇస్తే.. అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మహాలక్ష్మి పథకాన్ని గురించి ఘనంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో మాత్రం ఆ తీరుగా స్పందించకుండా..

పెండింగులో పెడుతూ వస్తోంది. పైగా.. ప్రతి నెలా ఓఆర్ పెరుగుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్, పండుగల సమయంలో ఇది మరింత భారీగా ఉంటోంది. అంటే.. ప్రభుత్వం నుంచి ప్రతినెలా రావాల్సిన సబ్సిడీ మొత్తంలోనూ పెరుగుదల ఉంటోంది. కానీ ప్రభుత్వం మాత్రం, ఈ ఓఆర్‌ను పట్టించుకోకుండా.. చెల్లించాల్సిన మొత్తం సబ్సిడీ చెల్లించకుండా ఇప్పటికీ కోత విధిస్తుండటంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి.

కుప్పకూలడం ఖాయం..

రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ ఉపాధి రంగం, అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీపై ప్రభుత్వం ద్వంద్వ విధానాలను ప్రదర్శిస్తున్నదని ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీని రక్షిస్తామని చెబుతూనే, మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాన్ని ఇవ్వకుండా కోతలు విధిస్తూ.. ఆర్థిక ఇబ్బందుల్లోకి, అప్పుల్లోకి వెళ్లే పరిస్తితిని కల్పిస్తున్నారని వారు మండిపడుతున్నారు.

ఇప్పటికే రూ. వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని రక్షించాలంటే.. ప్రభుత్వం తమ ప్రచారం కోసం చెప్పుకుంటున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం బకాయిలను చెల్లించాలని, అలాగే ప్రతినెలా ఎంతమేర మహిళల ప్రయాణాలు ఉంటాయో అంతమేర నిధులు విడుదల చేయాలని వారంటున్నారు. లేకపోతే, ఇప్పటికే మూలిగే నక్కలా ఉన్న ఆర్టీసీపై తాటిపండు పడ్డట్టుగా పరిస్థితి తయారవుతుందని, మొత్తం ఆర్టీసీ వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. 

ఆర్టీసీకి అప్పులే మిగులుతున్నాయి.. 

పరిపాలకులు వ్యవస్థలను కాపాడాలి. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని ఛిద్రం చేసేలా వ్యవహరిస్తుంది. ఆర్టీసీని రక్షించడానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. దీనితోపాటు బకాయిలను మొత్తం చెల్లించాలి. అలాగే వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్య లు తీసుకోవాలి. మహాలక్ష్మి పథకం.. ఆర్టీసీ వల్ల ప్ర భుత్వానికి పేరు వస్తోంది. కానీ ఆర్టీసీకి అప్పులు మి గులుతున్నాయి. ప్రభుత్వ పథకాలకు మేం వ్యతిరేకం కాదు. కానీ బకాయిలు పేరుకుపోతే, వ్యవస్థ నష్టాల్లోకి వెళుతుంది. ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే.. బిల్లులను పెండింగులో పెడితే ఎవరికి చెప్పుకోవాలి.

 ఈదురు వెంకన్న, ఈయూ జనరల్ సెక్రెటరీ, ఆర్టీసీ జాక్ చైర్మన్