14 March, 2026 | 4:43 AM

మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలి

14-03-2026 01:47 AM

ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి, మార్చి 13: కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యురాలు శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, ఆహార తయారీకి ఉపయోగిస్తున్న సరుకులు, వంటగది పరిస్థితులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న ఆహార నాణ్యతపై ఆరా తీశారు. అలాగే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, వైద్య పరీక్షల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.

కౌమార దశలో సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని పేర్కొంటూ, తప్పనిసరిగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. విద్యాలయంలో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వంటగది శుభ్రంగా లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని పేర్కొంటూ, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం ఎలా కాపాడగలమని ప్రశ్నించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.