12 May, 2026 | 5:21 AM

‘కిమ్స్’లో లూపస్ యోధుల ర్యాంప్ వాక్

12-05-2026 12:09 AM

ప్రపంచంలోనే ఐదోసారి..

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): దేశంలో చాలామందిని ప్రభావితం చేస్తున్న సిస్టమెటిక్ లూపస్ ఎరిథమటోసస్ (ఎస్.ఎల్.ఈ.) వ్యాధి విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. అంతర్జాతీయ లూపస్ డే సందర్భంగా సోమవారం కిమ్స్ ఆస్పత్రిలో లూపస్ వ్యాధితో పోరాడుతున్న వారితో వినూత్నంగా ర్యాంప్ వాక్ నిర్వహిం చారు. సుమారు 40 మంది యోధులు ర్యాంప్ వాక్ చే సి, తమ ఆత్మవిశ్వాసాన్ని, వ్యాధిని జయించగలమన్న నమ్మకాన్ని ప్రదర్శించారు.

దాదాపు వంద కుటుంబాలకు చెందిన పలువురు, నగరానికి చెందిన పలువురు వై ద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసియాలోనే ఇలా ర్యాంప్ వాక్ నిర్వహించడం ఇది ఐదోసారి. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి ఆలోచనల ఫలితంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

డాక్టర్ శరత్ చం ద్ర మౌళి మాట్లాడుతూ, ‘మన దేశంలో లూపస్ ఎక్కువగానే ఉన్నా, ఎంతమందికి వస్తోందన్న అధికారిక లెక్క లు లేవు. సాధారణంగా 15-45 ఏళ్ల మధ్య వయ సు (పునరుత్పత్తి దశ)లోనే ఇది వస్తుంది.  ఈ సమస్య గురిం చి ఇటు సామాన్య ప్రజలతో పాటు వైద్యుల్లోనూ అవగాహన అంతగా లేకపోవడంతో.. వ్యాధి వచ్చిన తర్వాత రుమటాలజిస్టు వద్దకు వెళ్లడానికి దాదాపు మూడేళ్లకు పైగా పడుతోంది. ఇది ఒక దీర్ఘకాలిక ఆటో-ఇమ్యూన్ వ్యాధి. 

ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెద డు, నరాలు, చర్మం, రక్తం.. ఇలా దేన్నయినా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో 20వేల మంది వరకు రుమటాలజిస్టులు అవసరం ఉం డగా, కేవలం 800 మంది మాత్రమే అందుబాటులో ఉండడం కూడా దీని చికిత్స సరిగా అందకపోవడానికి కొంత కారణం అవుతోంది అన్నారు.

విపరీతమైన నీర సం, అలసట, జ్వరం, బరువు తగ్గడం, శరీరంపై దద్దుర్లు, ఎండలో వెళ్లినప్పుడు ముఖంపై ఎర్రగా దద్దుర్లు రావ డం, జుట్టు రాలడం, ఆర్థరైటిస్, మూత్రంలో ప్రోటీన్ పోవడం, మూత్రంలో రక్తం పడడం, త్వరగా మర్చిపోవడం, రక్తహీనత, తెల్ల రక్తకణాలు లేదా ప్లేట్లెట్లు తగ్గడం, తరచు గర్భస్రావాలు కావడం, లేదా తరచు నోట్లో పుళ్లు రావడం... ఇవన్నీ కూడా లూపస్ లక్షణాలే. ఇలాంటి లక్షణాలు కనిపించిన తొలిదశలోనే రుమటాలజిస్టును సం ప్రదిస్తే.. దీన్ని పూర్తిగా నయం చేయవచ్చన్నారు.