అధికారం కోల్పోవడం ఖాయం!
- మ్యానిఫెస్టోలో పెట్టిన హామీల్లో కదలికేది?
- ఒకటో తేదీ జీతం తప్ప టీచర్లకు ఒరిగిందేమీ లేదు
- ప్రభుత్వంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ఫైర్
- నేడు ఇందిరా పార్క్ వద్ద టీచర్ల మహాధర్నా
- పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే 2034 వరకు అధికారంలో కొనసాగుతారని, లేకపోతే అధికారం కోల్పోవడం ఖాయమని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి(Teacher MLC Pingili Sripal Reddy) ప్రభుత్వా న్ని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో సెంటీమీటర్ కూడా కదలిక లేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ఒకటో తేదీన జీతాలు తప్ప ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సీఎం హామీల వైఫల్యాలపై మంగళవారం ఇందిరా పార్క్ వద్ద టీచర్ల మహాధర్నా నిర్వహిస్తున్నామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి తెలిపారు.
సోమవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మె ల్సీ బీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌తో కలిసి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. పెండింగ్ బిల్లును వంద రోజుల్లో చెల్లిస్తామని చెప్పారు.. 121 రోజులు దాటినా సగం కూడా బిల్లులు విడుదల చేయలేదని ఫైర్ అయ్యారు. ఈహెచ్‌ఎస్ కోసం నాలుగు నెలలుగా వేనతాల్లోని కటింగ్ చేస్తున్నారని..
హెల్త్ కార్డులు తీసుకుని ఏ దవాఖానకు వెళ్లినా చెల్లుబాటు కావడంలేదని స్పష్టం చేశారు. కొత్త పీఆర్సీ కమిటీ వేసి, ఆరు మాసాల్లో మెరుగైన ఫిట్మెంట్ ఇస్తామని హామీనిచ్చినా 33 నెలలు గడిచినా పీఆర్సీ జాడేలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మూడు డీఏలు పెండింగ్‌లో ఉంటేనే గగ్గొలు పెట్టారని.. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలనలో పెండింగ్ డీఏలు ఆరుకు చేరుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు.
అధికారంలోకి రానప్పుడు ఉద్యో గుల ఆందోళనలకు మద్దతు ప్రకటించిన కా్రంగెస్ ఇప్పుడదే ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. పెండింగ్ బిల్లులు నాలుగు వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ. 16వేల కోట్లకు చేరాయని, జీపీఎఫ్, కమ్యూటేషన్ తప్ప ఇతర బిల్లులు విడుదల కాలేదని తెలిపారు.
నేడు మహాధర్నా: దామోదర్ రెడ్డి
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పు ల్గం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ హామీలు, మేనిఫెస్టో గ్యారెంటీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం చలో హైదరాబాద్ పేరుతో మహాధర్నాను తలపెట్టినట్లు వెల్లడించారు.
ఇందిరాపార్క్‌లో నిర్వ హించే ఈ ధర్నాను విజయవంతం చేయాలని టీచర్లకు ఆయన పిలుపునిచ్చారు. పీఆ ర్సీ నివేదిక తెప్పించుకుని జూన్ 2న పీఆర్సీ అమలుచేస్తామని, సీపీఎస్ రద్దుకు కమిటీ వేస్తామని, వంద రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని సీఎం హామీనిచ్చి విస్మరించారని తెలిపారు. పీఆర్టీయూ టీఎస్ అడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.






