పశుసంపద రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆదాయ మార్గం
- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పశు సంపద రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆదాయ మార్గమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత పశు టీకాల కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయాన్ని అందిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. పశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటే పాల ఉత్పత్తి పెరిగి రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు.
లంపీ స్కిన్, గొంతువాపు, జబ్బవాపు వంటి అంటువ్యాధుల కారణంగా పశుసంపదకు నష్టం వాటిల్లి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను ప్రతి పశువుకు తప్పనిసరిగా వేయించి పశుసంపదను సంరక్షించాలని రైతులకు సూచించారు. పశువులకు ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్య అధికారులను సంప్రదించాలని, వ్యాధుల నివారణలో రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమని కలెక్టర్ హితవు పలికారు.






