10 June, 2026 | 7:33 PM

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ

10-06-2026 06:12 PM

* గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై అధికారుల సమీక్ష

అశ్వాపురం,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు మండల స్థాయి అధికారులు హాజరై గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై సమగ్రంగా చర్చించారు.

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు నీటి పారుదల, తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామస్థుల నుంచి వచ్చిన సమస్యలు, వినతులను స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.