10 June, 2026 | 7:32 PM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా

10-06-2026 06:25 PM

కౌన్సిలర్లు ప్రజల్లో మమేకమై  సేవలందించాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణతో కొనుగోళ్లు పూర్తి

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 1,13,14,15 వార్డులకు సంబంధించిన వార్డు సభ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. బుధవారం జరిగిన ఈ సమావేశాల్లో  విజయరమణ రావు మాట్లాడుతూ... మున్సిపల్ కౌన్సిలర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, నాళాలు ఎప్పటికప్పుడు శుభపరచుకోవాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తాను త్వరలోనే వార్డు బాట పడతానని చెప్పారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో నాలుగైదు రోజులు పర్యటిస్తానని చెప్పారు. కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆయా వార్డుల్లో త్వరలోనే సిసి రోడ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలో రోడ్ల వెడల్పు, సిసి రోడ్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఎలాంటి కటింగులు లేకుండా అనేక సమస్యలను అధిగమిస్తూ కొనుగోళ్లు పూర్తిచేసి, రైతుల సేవలో తరించినట్టు ఎమ్మెల్యే  తెలిపారు.

రైతు భరోసా, రైతు భీమా, సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదేనిని చెప్పారు. రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్నలను పొందుతుండగా, బీఆర్ఎస్ ఓరువలేకపోతుందని చెప్పారు. ప్రతిపక్షాల ధర్నాలకు రైతులు రావడంలేదని స్వయంగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొనడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని  విజయరమణ రావు  అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ,  మున్సిపల్ కమిషనర్ రమేష్, తహసీల్దార్, కౌన్సిలర్లు,  వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.