10 June, 2026 | 7:26 PM

జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి

10-06-2026 06:15 PM

గ్రామీణ పేదల సంఘం పిలుపు

చివ్వెంల,(విజయక్రాంతి): జూన్ 15న నిర్వహించనున్న "చలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రామీణ పేదల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ, ఎరువులు, క్రిమిసంహారక మందులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ తదితర వ్యవసాయ అవసరాల ధరలను విపరీతంగా పెంచి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. వరి ధాన్యానికి మద్దతు ధర పెంపు పేరుతో కేవలం స్వల్ప మొత్తమే పెంచి రైతులను మోసం చేస్తోందన్నారు.

అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ప్రతి ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రూ.12 వేలకు తగ్గించిందని ఆరోపించారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో రైతు భరోసా నిధుల చెల్లింపుల్లో కూడా తీవ్ర జాప్యం జరిగిందని పేర్కొన్నారు.

నాణ్యమైన విద్యుత్, సాగునీరు, ఎరువులు, యూరియా, క్రిమిసంహారక మందుల సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం, హామీల అమలు తదితర డిమాండ్లతో జూన్ 15న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.