18 March, 2026 | 10:03 AM

కలిసికట్టుగా ముందుకు సాగుతూ.. సురక్షిత మానుకోటగా తీర్చిదిద్దుదాం

18-03-2026 12:00 AM

ఎస్పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): సురక్షిత మానుకోట లక్ష్యంగా కలిసికట్టుగా ముందుకు సాగుదామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పీ ఎస్ ఆర్ గార్డెన్ లో పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని గ్రామ సర్పంచులు, వార్డ్ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయించడం ద్వారా నేరాలను సమూలంగా అరికట్టవచ్చన్నారు.

గ్రామాభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం మీరు ముందుండి పనిచేయాలని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసం కట్టుబడి ఉందని, ప్రజల సహకారం ఉంటేనే సమాజంలో శాంతి, భద్రతలు మరింత మెరుగుపడతాయన్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, ప్రమాదాల ప్రధాన కారణాలు, నిర్లక్ష్యం వల్ల కలిగే ప్రాణ నష్టం గురించి వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

‘ఆర్రైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. అలాగే సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించేందుకు, గతంలో సీసీ కెమెరాల సహాయంతో ఛేదించిన కేసుల ఫుటేజీలను ప్రదర్శించారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి గ్రామంలో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

డ్రగ్స్, గంజాయి వాడకం వల్ల యువత భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో వివరిస్తూ, మత్తు పదార్థాలపై ప్రత్యేక వీడియోలను ప్రదర్శించారు. గ్రామ స్థాయిలోనే డ్రగ్స్ నిర్మూలనకు ప్రజాప్రతినిధులు ముందుండాలని, యువతను సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో 100, సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్లైన్ నంబర్లను వినియోగించాలని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, భద్రత కోసం రూపొందించిన చెక్ లిస్ట్ పోస్టర్ను కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరి చేత ఆవిష్కరించారు. గ్రామాల్లో అమలు చేయాల్సిన ముఖ్య భద్రతా చర్యలు, యువత మార్గదర్శక అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయని అన్నారు.

అలాగే, గ్రామ అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణలో ఆదర్శంగా నిలిచిన ఆదర్శ గ్రామ సర్పంచ్లకు జిల్లా ఎస్పీ  శబరీష్ సన్మానించి ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధుల్లో చైతన్యం పెంచి, గ్రామ స్థాయిలో భద్రతా చర్యలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు గండ్రతి మోహన్, తిరుపతి రావు, కృష్ణ కిషోర్, సీఐలు, ఎస్.ఐలు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.