మరదలుతో నిశ్చితార్థం.. విద్యార్థినితో ప్రేమపెళ్లి!
- అధ్యాపక వృత్తికి మచ్చ తెచ్చిన లెక్చరర్
- తొమ్మిది రోజుల నుంచి కళాశాలకు గైర్హాజరు
- చర్యలు తీసుకోని అధికారులు
- విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
- కళాశాల ముందు ఏబీవీపీ నాయకుల ఆందోళన
పాపన్నపేట, జూన్ 24: మరదలుతో నిశ్చితార్థం జరిగిన తర్వాత కళాశాలలో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినిని ప్రేమ వివాహం చేసుకున్న కళాశాల లెక్చరర్ ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు సావుల ఆదిత్య, స్టేట్ కో- కన్వీనర్ బండారి ప్రశాంత్ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల ముందు ఆందోళన నిర్వహించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న ఓ విద్యార్థినిని అదే కళాశాల సివిక్స్ లెక్చరర్ ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఆ విద్యార్థినిని తల్లిదండ్రులకు తెలవకుండా తీసుకెళ్లి పెళ్లి చేసుకొని తొమ్మిది రోజులు కావస్తున్నా కనీసం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి ఆ లెక్చరర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విషయాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
విద్యార్థులకు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన గౌరవప్రదమైన ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి ఉపాధ్యాయ వృత్తికే కలంకంగా మారి విద్యార్థులతో ప్రేమ వ్యవహారం నడిపించిన సివిక్స్ లెక్చరర్ ను వెంటనే విధుల నుండి తొలగించి మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదేవిధంగా వ్యవహారంపై ఇప్పటికి కూడా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చర్యలు తీసుకోకుండా పట్టించుకోకుండా ఉంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.






