నిబంధనల ప్రకారమే రైతులకు పట్టాలు
ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ రూరల్, జూలై 9: నిబంధనలకు అనుగుణంగా అర్హులైన రైతులకు పట్టా లు అందించి, భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం సోమశిలలో రైతుల సమక్షంలో అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అధికారులు గ్రామాల్లోనే సమస్యలను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి పోడు భూములు, సర్వే వివాదాలు, పట్టాదారు పాస్బుక్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూ చించారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ, సంయుక్త సర్వేల ద్వారా అర్హత నిర్ధారించిన రైతుల భూములను భూ భారతి పోర్టల్లో నమోదు చేసి, ప్రభుత్వ నిబంధనల మేరకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తామని తెలిపారు. రైతులకు ఎలాంటి అ న్యాయం జరగకుండా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని పేర్కొన్నారు.






