కేయూ భూములను పరిరక్షించాలి
కేయూ, వరంగల్, మార్చి 16 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, ఇతర శాఖలకు కేటాయించవద్దని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ డాక్టర్ నిమ్మల రాజేష్ మాట్లాడుతూ 1989 సంవత్సరంలో నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా యూనివర్సిటీ పరిధిలోని కొంత భూమిని సీ ఆర్ పీ ఎఫ్ బెటాలియన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించిందన్నారు.
అయితే ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోవడంతో సీ ఆర్ పీ ఎఫ్ దళాలు ఆ స్థలాన్ని ఖాళీ చేశాయని, ప్రస్తుతం ఆ స్థలాన్ని పోలీస్ శాఖకు కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వెంటనే పోలీస్ శాఖకు ఆ స్థలాన్ని కేటాయించకుండా విద్య అవసరాల కోసం భూమిని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఫణీంద్ర, విభాగ్ సెక్రటరీ సుజీత్, సాయి , విజయ్, సంజయ్, వేణు పాల్గొన్నారు.




