8 June, 2026 | 2:45 AM

కిషన్ రెడ్డీ నీ సంగతి చెబుతాం

08-06-2026 01:06 AM

కాళ్ల సందుల కట్టెబెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నవ్

మల్కాజ్గిరి మునిసిపల్ కార్పొరేషన్, 100 పడకల జిల్లా ఆస్పత్రి భవనాలకు శంకుస్థాపన

మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్, మూసీ ప్రక్షాళనకు అడ్డంకులు..

  1. రాష్ట్రం, హైదరాబాద్ అభివృద్ధికి సమస్యలు సృష్టిస్తున్నవ్
  2. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీతో చీకటి వ్యవహారం 
  3. నీవల్లే మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు
  4. కేంద్రమంత్రులను కలుస్తానంటే ఎందుకు తీసుకెళ్లవు
  5. ఈ నెల 15 నుంచి నీపై కార్యాచరణ ఉంటుంది
  6. కేంద్రం ధాన్యం కొననందుకే.. రాష్ట్రంలో ఇబ్బందులు
  7. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
  8. రెండోదశ మూసీ ప్రాజెక్ట్‌ను 100 రోజుల్లో ప్రారంభిస్తాం
  9. ఉప్పల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

మేడ్చల్, జూన్ 7 (విజయ క్రాంతి): హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిది ద్దడానికి, ఇతర అన్ని అభివృద్ధి పనులకూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాళ్ల సందులో కట్టే పెట్టి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్, మూసీ ప్రక్షాళనకు అడ్డంకులు సృష్టిస్తు న్నావు. -ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీతో చీకటి వ్యవహారం నడుపుతున్నావు. నీవు చెప్పినందు వల్లే మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.

కేంద్రమంత్రుల ను నేను కలుస్తానంటే నీవు ఎందుకు తీసుకెళ్లవు. కిషన్‌రెడ్డి నీ సంగతి చెబుతాం. ఈ నెల 15 నుంచి నీపై కార్యాచరణ ఉంటుంది’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్రం ధాన్యం కొననందుకే.. రాష్ట్రంలో పంట కొనుగోలులో ఇబ్బందులు వస్తున్నాయని, ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని, రెండోదశ మూసీ ప్రాజెక్ట్‌ను 100 రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆదివారం ఉప్పల్ భాగాయత్‌లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.

హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఏదోరకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మెట్రో విస్తరణకు, రీజినల్ రింగ్ రోడ్డుకు, మూసీనది ప్రక్షాళనకు అనుమతులు ఎందు కు రావడం లేదు? ఎవరు ఆపుతున్నారు? సమాధానం చెప్పే బాధ్యత నీకు లేదా అని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. గుజరాత్‌లో సబర్మతి, ఉత్తరప్రదేశ్‌లో యమునా నది, గంగా నది ప్రక్షాళన చేసినట్లు మేము హైదరాబాద్‌లో మూసీ నదిని ప్రక్షాలన చేయొద్దా అని ప్రశ్నించారు.

గండిపేట నుంచి గోడవెల్లి వరకు 52 కిలోమీటర్ల మూసీనది ప్రక్షాళన చేస్తే పర్యాటక పరంగా అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. న్యూయార్కులో నది ఒడ్డున అపార్ట్మెంట్లు కోట్ల విలువ చేస్తుంటే, హైదరాబాద్‌లో మూసీనది ఒడ్డున మురికి నీటి వల్ల ధరలు పెరగడం లేదన్నారు. నల్గొండ జిల్లాలో మూసీ మురుకు నీటితో పాటు, ఫ్లోరైడ్ నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీరు తాగితే అబార్షన్లు అవుతాయి అనే ఉద్దేశంతో కొత్తజంటలను హైదరాబాద్ నగరానికి పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నిర్వాసితులకు ఇల్లు పోతే ఇల్లు ఇస్తామని, ఆ కుటుంబానికి విద్య అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నాగోల్ నుంచి గౌరవెల్లి వరకు రెండోదశ మూసీ ప్రక్షాళన 100 రోజుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తూ తెలంగాణలో పడిన ధాన్యంలో సగం కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనందున ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు.

ధాన్యం కొనుగోలులో వివక్ష ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి వ్యవహారాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీతో చీకటి వ్యవహారాలు నడుపుతున్నారని, ఆ పార్టీ నాయకులే అంటున్నా రని సీఎం అన్నారు. కేటీఆర్ చెప్పినట్లు నడుచుకుంటున్నారని విమర్శించారు. తుమ్మిడి హట్టి విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించానని, అపా యింట్మెంట్ ఇవ్వవద్దని కిషన్‌రెడ్డి చెప్పడం వల్ల తనకు అపాయింట్మెంట్ దొరకలేదని అన్నారు.

అభివృద్ధి పనుల విషయమై కేంద్రమంత్రులను కలుస్తానంటే ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకు ఉందని అన్నారు. ఈ నెల 15 తర్వాత కార్యాచరణ ఉంటుందని, ‘నీ సంగతి చెబుతాం’ అని అన్నారు.

అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు 

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో నాలుగు రకాల పాలన ఉండేదని, దీంతో ఇబ్బందులు అవుతున్నాయనే ఉద్దేశంతో రింగ్‌రోడ్డు లోపల గ్రామా లన్నీ విలీనంచేసి, మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. రింగ్ రోడ్డు లోపల కోటి 34 లక్షల జనాభా ఉందని, అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయని, మౌలికవసతులు కల్పించాల్సి ఉంద న్నారు.

అన్ని డిపార్ట్మెంట్ లతో సంబంధం చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని కోరుగా పరిగణిస్తున్నామని వివరించారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే మూడు కార్పొరేషన్లు చేశారని అంటున్నారని, కానీ పరిపాలన సౌలభ్యం కోసమే చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతం లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయాను అని, ప్రస్తుతం అవకాశం ఉన్నందున అభివృద్ధి చేస్తానన్నారు.

ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి పనికి ఎన్ని నిధులు అయినా ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలని, ప్రస్తుతం రాజకీయాలు చేసే అవసరం లేదని, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారి సోదరుడు రాజిరెడ్డి పేరును ఎలివేటెడ్ కారిడార్‌కు పెట్టామని గుర్తు చేశారు.

కుడివైపున మహిళలకు సీట్లు కేటాయించాలి

తాను పాల్గొనే సభలలో కుడి వైపున మహిళలకు సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎడమవైపున పురుషులకు కూర్చోబెట్టాలన్నారు. మహిళలు ఆశీర్వదించినందున తాను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. ఎక్కడ సభ జరిగినా అధికారులు ఈ పద్ధతి పాటించాలని సూచించారు. 

రూ.1,511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లో రూ.1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. 10 ఎకరాల్లో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజ్గిరి మునిసిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి, రూ.960 కోట్లతో ఏఓసీ సెంటర్‌లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి, రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్‌లో 6 లేన్ల ఫ్లై ఓవర్, రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. క్యూర్ వన్ యాప్‌ను ఆవిష్కరించారు.

అన్నింటికీ సహకరిస్తే కిషన్‌రెడ్డికి గండపెండేరం 

హైదరాబాద్ మెట్రో ఈ రోజు 9 వ స్థానానికి పడిపోయిందని, మెట్రోను విస్తరించడానికీ కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరించాలన్న అవసరం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. అన్ని అనుమతులు వచ్చాక కేంద్రమంత్రిగా ఉన్న ఆయన కాళ్లలో కట్టెలు పెట్టి ఆపుతున్నాడని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే ప్రపంచంతోనే పోటీ పడే అవకాశం ఉంటుందని, రెండున్నర యేళ్ల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాభై సార్లు ఢిల్లీ వెళ్లానని, మోదీని కలిశానని చెప్పారు.

ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిన, సహకరించాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. అన్నింటికీ సహకరిస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్‌రెడ్డికి గండపెండేరం తొడుగుతామని రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో కిషన్‌రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు చేస్తే ప్రజలు ఓడించారని, ఎన్నికల సమయంలో రాజకీయాలు చేద్దామని, కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామ ని కోరారు.

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం: మంత్రి శ్రీధర్‌బాబు 

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మూసీనది ప్రక్షాళనలో పేదవారికి నష్టం చేయబోమని తెలిపారు. కేంద్ర సాయం లేకు న్నా, గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసినా సంక్షేమ పథకాలు కొనసాగి స్తున్నామన్నారు. మహిళల కు ఉచిత ప్రయాణం 6 నెలలు కొనసాగదని కొందరు విమర్శించారని, కానీ రెండున్నర ఏళ్లయినా కొనసాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎం పీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్ యాద వ్, చామల, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, శ్రీగణేష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కలెక్టర్ మనుచౌదరి, మాజీ ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్ రెడ్డి, మై నంపల్లి హనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, రజిత పరమేశ్వ ర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.