29 July, 2026 | 2:34 AM

బోర్డు తిప్పేసిన వ్యాపారి

29-07-2026 01:38 AM

బకాయిల కోసం మార్కెట్ ఎదుట రైతుల ధర్నా 

పెట్రోల్ పోసుకుని ఒకరి ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్‌లో ఉద్రిక్తత 

మహబూబాబాద్, జూలై 28 (విజయక్రాంతి): వాయిదా పద్ధతిలో రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసిన ఓ వ్యాపారి బోర్డు తిప్పేయడంతో తమకు రావాల్సిన బకాయి డబ్బుల కోసం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదుట బాధిత రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు.

బాధిత రైతులు తమకు ఆ వ్యాపారి నుంచి రావాల్సిన బకాయిలను తక్షణం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ గేటుకు తాళం వేసి నిరసనకు దిగారు. బాధిత రైతుల్లో ఒకరైన ఎం హోలీ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఎస్‌ఐ ఉమ సహచర రైతులు అతని ఒంటిపై నీళ్లు చల్లి అడ్డుకున్నారు.

వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే ఎన్ ఎస్ ట్రేడింగ్ కంపెనీ యజమాని వ్యవసాయ మార్కెట్‌లో రైతుల నుంచి మిర్చి, మొక్కజొన్నలు కొనుగోలు చేసి ఎనిమిది మంది రైతులకు సుమారు 22 లక్షల రూపాయలు బకాయి పడ్డాడు. రూ.50 లక్షలకు బకాయి పడగా మార్కెట్ అధికారులు గత కొంతకాలంగా ఆ వ్యాపారి నుంచి రైతులకు 20 లక్షలకు పైగా బకాయి చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలో మిగిలిన రైతులకు కూడా బకాయి డబ్బులు చెల్లిస్తానని అధికారులకు నమ్మబలికి ఆ వ్యాపారి ఉన్నఫలంగా ఇటీవల బోర్డు తిప్పేశాడు. తాము గత ఏప్రిల్ నుంచి బకాయి డబ్బుల కోసం మార్కెట్ అధికారులు, పాలకమండలి వద్దకు తిరుగుతున్న పట్టించుకోలేదని, చివరకు ఇప్పుడు వ్యాపారి బోర్డు తిప్పేసాడని, తమకు మార్కెట్ అధికారులు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్ అధికారుల ఉదాసీనత వల్లే తమకు అన్యాయం జరుగుతోందని, వెంటనే చర్యలు తీసుకొని తమకు డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.