జపాన్‌లో భూకంపం
- 7.1 తీవ్రతతో ప్రకంపనలు
- షాపింగ్ మాల్ శిథిలా కింది చిక్కుకున్న 50 మంది
- చైనాలోనూ 5.7, 5.8 తీవ్రత నమోదు
టోక్యో, జూలై 28: జపాన్ 7.1 తీవ్రతతో దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యూషులోని కుమామోటో ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. బలమైన ప్రకంపనల కారణంగా కాషిమా నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో రెండో అంతస్తు కూలిపోయి శిథిలాల కింద 50 మంది చిక్కుకుపోయారు. భూకంపం వల్ల క్యుషు ఎక్స్‌ప్రెస్‌వే దెబ్బతిన్నది. కుమామోటోలోని ‘అయాన్ మాల్’లో పేలుడు సంభవించింది. యాత్సుషిరోలో ఓ భవనం మంటలు చెలరేగాయి.
నిప్పన్ పేపర్ ఇండస్ట్రీస్ యాత్సుషిరో మిల్లులో చిమ్నీ కూలిపోయింది. కుమామోటోలో రైలు పట్టాలు తప్పింది. భూకంపం ధాటికి కుమామోటో కోట ప్రహరీ కూలింది. భూకంప కేంద్రం సముద్ర ఉపరితలానికి 10 కి.మీ. లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాగసాకి, కగోషిమా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రాంతాలకు జపాన్ ప్రభుత్వం అత్యవసర భూకంప, సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అనంతరం సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.
కాగా ఈ భూకంపం వల్ల ముందుజాగ్రత్త చర్యగా 1.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపం వల్ల 48,300కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంపంతో అనేక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంపం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి సనాయే తకాయిచి ఎక్స్ వేదికగా వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశాశారు.
పరిస్థితులను అంచనా వేసేందుకు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ క్యూషుకు పలు ఎమర్జెనీ హెలికాప్టర్లను పంపింది. అటు చైనాలోని మారుమూల ప్రాంతమైన కింఘై ప్రావిన్స్‌లోనూ 5.7, 5.8 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప కేంద్రం 10 కి.మీ. లోతులో ఉన్నట్లు స్పష్టం చేసింది. 18 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయని వివరించారు. దీంతో స్థానిక ప్రభుత్వం అప్రమత్తమై ప్రజలకు అలర్ట్ జారీ చేసింది.






