కన్నీటి సంద్రం టెహ్రాన్
మూడో రోజూ ఖమేనీ అంత్యక్రియల క్రతువు
తండ్రి భౌతికకాయం వద్ద ముగ్గురు కుమారుల ప్రార్థనలు
కనిపించని ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ
టెహ్రాన్, జూలై 5: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ శవపేటిక వద్ద అశేష జనవాహిని కన్నీరు సంద్రంలా పోటెత్తుతోంది. కుటుంబీకులు, ప్రజలు, అధికారుల అశ్రునయనాలతో భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. ఆయనను కడసారి చూసేందుకు టెహ్రాన్‌కు జనం పోటెత్తుతున్నారు. మూడో రోజైన ఖమేనీ అంత్యక్రియల క్రతువులో ఇమామ్ ఖమేనీ గ్రాండ్ మొసల్లా ప్రాంగణంలో ఆదివారం ఖమేనీ ముగ్గురు కుమారులు ముస్తఫా, మేసమ్, మసౌద్ తమ తండ్రి శవపేటిక పక్కన చేరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మసౌద్ ఖమేనీ కన్నీళ్లు పెట్టుకుంటూ విప్లవ ప్రతీక అయిన కఫియాతో తుడుచుకోవడం అక్కడ ఉన్నవారిని కలచివేసింది. కానీ ఖమేనీ మరో తనయుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కన్పించలేదు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహ్మద్ బాఖెర్ ఖలీబాఫ్ కూడా శవపేటికల వెనుక నిలబడి ప్రార్థనలు చేశారు. ఇరాన్‌లో అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల యాత్ర ఆదివారం మూడో రోజుకు చేరింది. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, పద్నాలుగు నెలల మనవరాలు మరణించారు. వారి శవపేటికలను కూడా ఇక్కడే ఉంచారు.
దశాబ్దాల పాటు ఇరాన్‌ను శాసించిన నాయకుడికి నివాళులు అర్పించేందుకు అశేష జనవాహిని తరలివచ్చింది. అయితే ఈ అంత్యక్రియల వేడుకల్లో ఖమేనీ వారసుడిగా ఎంపికైన మరో కుమారుడు మోజ్తబా ఖమేనీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఆయన అంత్యక్రియ ల ప్రాంగణంలో ఎక్కడా ప్రజలకు లేదా మీడియాకు దర్శనమివ్వలేదు. ఇదిలా ఉంటే సంతాపకులు ఖమేనీ మరణం ఇమామ్ హుస్సేన్ అమరత్వం, ప్రతిఘటన, వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. ఆయనను తలచుకుంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. వారి నినాదాలు, ఎర్ర జెండాలు, కర్బలా స్మరణలు ఆ క్షణాన్ని నిరంకుశత్వానికి వ్యతిరేకంగా షియాల ధిక్కారానికి సజీవ నిదర్శనంగా నిలిపాయి.
మరోపక్క ఖమేనీ చివరి చూపు కోసం ఇరాన్ ప్రజలు టెహ్రాన్‌కు పోటెత్తుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు టెహ్రాన్ మెట్రో నెట్వర్క్‌లో ఏడు మిలియన్ల మంది ప్రయాణించారని అధికారులు వెల్లడించారు. ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని మొత్తం ఆరు రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సోమవారం టెహ్రాన్ కేంద్రంగా భారీ ఊరేగింపు సాగనుంది. మంగళవారం షియా ముస్లింల పవిత్ర నగరమైన కోమ్‌కు ఖమేనీ పార్థివ దేహాన్ని తరలిస్తారు.
బుధవారం ఇరాక్ దేశంలోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు ప్రత్యేక విమానంలో తీసుకెళ్తారు. అనంతరం గురువారం ఇరాన్‌లోని మషద్ నగరానికి తీసుకువచ్చి, అక్కడ ఉన్న పవిత్ర ఇమామ్ సమాధి చెంత ఖమేనీ భౌతికకాయాన్ని అంత్యక్రియలు పూర్తి చేసి, ఖననం చేస్తారు. తరలివచ్చే లక్షలాది మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత రవాణా, భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తోంది.






