17 June, 2026 | 1:42 AM

ప్రభుత్వ స్కూళ్ల మూసివేతపై కన్నెర్ర

17-06-2026 12:29 AM
  1. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర
  2. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి
  3. ఏబీవీపీ నేతల డిమాండ్
  4. హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా 
  5. విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, 23 వేల స్కూళ్లను మూసివేసే కుట్రను తక్షణమే ప్రభుత్వం విరమించు  ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎంఈవో, డీఈవో పోస్టులతోపాటు ప్రభుత్వ స్కూళ్లలోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రైవేట్ స్కూళ్లు అశాస్త్రీయంగా పెంచుతున్న ఫీజులకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు. జాతీయ కార్యదర్శి శ్రావణ్ బి రాజ్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ ప్రభుత్వ విద్యావ్యవస్థను గాలికొదిలేసిందని, పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు పూనుకుందని విమర్శించారు.

ఈ నిర్ణయాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు అందించే విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా మాఫియాపై చర్యలు తీసుకోవాలని, అందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేద విద్యార్థులకు ఫీజుల భారం నుంచి ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ సూళ్లల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం అన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ ఫీజులను తలదన్నేలా పాఠశాలల ఫీజులున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో పోస్టులతో పాటుగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎన్‌ఈపీ-2020 అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని,పేద విద్యార్థుల కోసం కోట్లాడుతున్న ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల జులుం ఏంటని ప్రశ్నించారు.

అక్రమంగా అరెస్టు చేసిన కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో కాస్త తోపులాట జరిగింది. ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కార్యక్రమంలో సిటీ సెక్రెటరీ పృథ్వీతేజ, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతూ సింగ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాజు, మహేష్, దీపికా, శ్యామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.