సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ
సూర్యాపేట రూరల్, జూన్ 16: సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించిన ఆయన, బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు వేగవంతమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు సమాచారం అందిన వెంటనే సిబ్బంది బాధితుల ఇళ్లకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి, అక్కడి నుంచే కేసులు నమోదు చేసే విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. డయల్ 100 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, అర్ధరాత్రి వేళల్లో గ్రామాల్లో బీట్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు.
గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాను కఠినంగా అణచివేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిపై భద్రతను పటిష్టం చేస్తూ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు చేరువగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అందించాలని పిలుపునిచ్చారు. ఈ తనిఖీల్లో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.






