ఉప ముఖ్యమంత్రి పర్యటనలో ఫ్లెక్సీల వివాదం
కాంగ్రెస్ రెండు వర్గాల మధ్య తోపులాట
గద్వాల, / మల్దకల్ జూలై 14 : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని కుర్తి రావులచెరువు సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత తిరుపతయ్య వర్గం కార్యకర్తలు తమ నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో పరస్పరం వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకుంటూ తోపులాటకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉప ముఖ్యమంత్రి పర్యటనకు ముందు చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న స్థానిక నాయకులు, పోలీసు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం ఇరువర్గాలు తమ తమ ఫ్లెక్సీల ఏర్పాటును కొనసాగించాయి. గద్వాల కాంగ్రెస్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ అధిష్ఠానం ఈ తరహా ఘటనలపై దృష్టి సారించి సమన్వయం తీసుకురావాలని కార్యకర్తలు కోరుతున్నారు.






