20 June, 2026 | 3:29 AM

బదిలీ..గిదిలీ జాన్తా నై..!

20-06-2026 01:56 AM
  1. జిల్లా కలెక్టర్, డీఈఓ ఆదేశాలు భేఖాతర్
  2. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎస్‌ఓపై బదిలీ వేటు
  3. తిరిగి అదే పాఠశాలకు వెళ్లి రికార్డుల చించివేత
  4. తప్పును వెనకేసుకొస్తున్న పై అధికారులు

నాగర్ కర్నూల్ జూన్ 19 ( విజయక్రాంతి ): తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న తిమ్మాజిపేట కస్తూర్బా పాఠశాల ఎస్‌ఓపై జిల్లా కలెక్టర్ బదిలీ వేటు వేశారు. విద్యార్థులకు అందించాల్సిన నాణ్యమైన భోజన సామాగ్రి విషయంలో అవకతవకలు, వాటిని ప్రశ్నించిన తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు నేపథ్యంలో కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు వంట ఏజెన్సీ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది మూకుమ్మడిగా ఈనెల 1న జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

అనంతరం పై అధికారులు, రాజకీయ అండతో కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతో ఈనెల 11న ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డిని కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నేరుగా జిల్లా కలెక్టర్ ను కలిసి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఈ నెల 16న అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తిమ్మాజిపేట ఎస్‌ఓ సుజాతను కోడేరు మండల కేజీబీవీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఆ ఉత్తర్వులను స్వీకరించి కోడేరు మండల కేజీబీవీలో విధుల్లో చేరాల్సిన సదరు ప్రత్యేక అధికారి తిరిగి శుక్రవారం తిమ్మాజిపేట కేజీబీవీకే వెళ్లడంతో అక్కడి ఉపాధ్యాయ బృందం సిబ్బంది, విద్యార్థులు అవాక్కయ్యారు. బదిలీ గిదిలీ జాన్తానై  నేనుండేది ఇక్కడే. నన్నెవరూ ఎం చేయలేరంటూ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలనుసైతం లెక్క చేయకుండా నేరుగా ప్రత్యేక అధికారి కుర్చీలోనే కూర్చుంది. అక్కడి అకౌంట్ రికార్డులు, విద్యార్థుల రికార్డులను ముఖ్యమైన పత్రాలను చించేయడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.

విషయాన్ని కాస్త ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో అక్కడికి చేరుకున్న ఎంఈఓ సత్యనారాయణ శెట్టి అసలు విషయాన్ని పక్కనపెట్టి అనధికారికంగా కుర్చీలో కూర్చున్న ప్రత్యేక అధికారిని ప్రశ్నించకుండా అందుకు సాక్ష్యంగా ఫోటోలు తీసిన వ్యక్తులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఉపాధ్యాయులు ఆరోపించారు. సుదీర్ఘ కాలం పాటు అక్కడే విధుల్లో ఉన్న ఎస్‌ఓ రాజకీయ పలుకుబడితో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని పలుమార్లు ఫిర్యాదులు అందాయి.

ఈ వ్యవహారంలో వారిపై అధికారులు సైతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఎస్‌ఓ ను వెనకేసుకు రావడం వెనక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పై అధికారుల బాగోతం బయటపడుతుందనే రికార్డులను చించేసారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈ విషయంపై ఎంఈఓ సత్యనారాయణ శెట్టిని వివరణ కోరగా చార్జ్ ఇచ్చేందుకే అక్కడికి వెళ్లిందని తన తప్పేం లేదంటూ చెప్పుకోచ్చారు. దీనిపై డిఇఓ రమేష్ కుమార్ స్పందిస్తూ ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరుగుతుందని తప్పు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.