20 June, 2026 | 2:36 AM

రాష్ట్రంలో మాఫియా పాలన!

20-06-2026 01:18 AM
  1. ఎవరిని కదిలించినా ఇదే చెబుతుండ్రు
  2. కాంగ్రెస్ సగం సినిమా  అట్టర్ ప్లాప్
  3. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే
  4. ఇప్పటినుంచే కార్యకర్తలు కదంతొక్కాలి
  5. ‘సర్’తో జాగ్రత్త.. ఒక్క ఓటు పోవొద్దు  
  6. మల్కాజ్‌గిరి నియోజకవర్గ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : ‘రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదు, మాఫియా పాలన. ఎవరిని కదిలించినా ఇదే చెబుతుండ్రు’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని కేటీఆర్ ధీమా వ్యక్త చేశారు. శుక్రవారం మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.

జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సైబరాబాద్, మల్కాజిగిరిపై బీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడటం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణకు మళ్లీ మంచిరోజులు రావాలన్నా, హైదరాబాద్‌లో అభివృద్ధి పరుగులు పెట్టాలన్న బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు.    కేసీఆర్ సారథ్యంలో పదేళ్ల పాటు అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల మాదిరిగా ముందుకు సాగిందని కేటీఆర్ తెలిపారు.

2014కు ముందు వేసవి వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు కరెంట్ కష్టాలతో అల్లాడిపోయే వారని గుర్తుచేశారు. అపార్ట్ మెంట్లు, దుకాణాల వద్ద జనరేటర్ల మోత మోగేదని, ప్రజల జేబులు ఖాళీ అయ్యేవని పేర్కొన్నారు. పరిశ్రమలకు మూడు రోజులు పవర్ హాలిడే ప్రకటిస్తే, ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేసే దుస్థితి ఉండేదని స్పష్టం చేశారు. తాగునీటికి సైతం తండ్లాట ఉండేదని.. ఖైరతాబాద్‌లోని జలమండలి నిత్యం ఖాళీ బిందెలతో ధర్నాలు, నిరసనలు హోరెత్తేదన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్టటిన ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కరెంట్ సమస్యను శాశ్వతంగా తీర్చారని, రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి వ్యవసాయానికి, గృహ అవసరాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించారని, హైదరాబాద్ నగరవాసుల తాగునీటి కష్టాలను తీర్చారని వెల్లడించారు.

సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించామని, రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2000కు పెంచామని, ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించామని తెలిపారు. అందులో మల్కాజి గిరిలోనే 3,500 డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చుకున్నామని చెప్పారు. 15 లక్షల మంది ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు అందించి ఆదుకున్న మేనమామ కేసీఆర్ అని వెల్లడించారు. 

కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమాగం

ట్రెయిలర్ చూస్తేనే సినిమా హిట్టో, ఫట్టో చెప్పే రోజులివని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సగం సినిమా అట్టర్ ప్ల్లాప్ అయ్యిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ అసమర్థ పాలనను చూసి తిట్టుకోని రోజు లేదని స్పష్టంచేశారు.30 నెలల్లో ఆగం చేసిందని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నాడు పెద్దపెద్ద మాటలు చెప్పాడని.. తులం బంగారం ఇస్తాం, రైతుభరోసా 15 వేలు చేస్తాం, పెన్షన్‌ను డబుల్ చేస్తామని హామీ లిచ్చారని దుయ్యబట్టారు.

అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల పేరిట చేసిన మోసం.. రెండున్నరేళ్ల పాలనలో బట్టబయలైందని మండిపడ్డారు. గ్యారెంటీ కార్డును భద్రంగా పెట్టుకోవాలని చెప్పిన డిప్యూటీ సీఎం మాటలు నీటి మూటలయ్యాయన్నారు. గ్యారెంటీల సంగతి ఏమైందని సీఎంను ప్రశ్నిస్తే, గుడ్లు పీకి గోటీలు ఆడతా, పేగులు మెడలో వేసుకుంటా అని తిట్ల పురాణం అందు కుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్ అప్పుచేసిన ప్రతిపైసాతో దశాబ్దాల పాటు తెలంగాణను పట్టి పీడించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారని అన్నారు. కరెంట్ కష్టాలు తీర్చడంతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారన్నారు. 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆరు దశాబ్దాల్లో ఒక్కటంటే ఒక్క కొత్త ఆసుపత్రి నిర్మించలేదని, కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నలుమూలలా కార్పొరేట్ ఆసుపత్రులను, తలదన్నే స్థాయిలో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం జరిగిందని కేటీఆర్ తెలిపారు.

నాడు కేసీఆర్ శ్రీకారం చుట్టిన సనత్‌నగర్, అల్వాల్‌టిమ్స్ ఆసుపత్రులే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.  బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన నిర్మాణాలకు రిబ్బన్ కటింగ్ చేసేందుకు మాత్రమే ముఖ్యమంత్రి కత్తెర పట్టుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

మల్కాజిగిరిలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, గతంలో పార్టీ కార్యకర్తలను ముట్టుకుంటే.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా అండగా నిలబడ్డామని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.  అరాచక పాలనకు చరమగీతం పాడే దాకా కలిసికట్టుగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఎస్‌ఐఆర్‌లో అర్హులైన ఓటర్లను తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు  అప్రమత్తంగా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు.

18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. మల్కాజిగిరిలో 480 బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ బాధ్యత తీసుకోవాలని స్పష్టంచేశారు. సభ్యత్వ నమోదును డిజిటల్ రూపంలో చేపట్టేందుకు మెంబర్‌షిప్ యాప్‌ను  తీసుకువస్తున్నామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి అత్యంత సులభంగా సభ్యత్వ నమోదు చేయించేలా యాప్‌ను రూపొందించాం పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును చేసేందుకు ప్రతి కార్యకర్తల నడుం బిగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇండ్లు కూల్చుడే.. నిర్మించడం చేతకాదు

హైదరాబాద్ పరిధిలోనే జీవో 58, 59 కింద రెండున్నర లక్షల మంది పేదలకు పట్టాలిచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి పేదల ఇండ్లు కూల్చాడు  తప్ప, నిర్మాణాలు చేతకావని కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేళ్లలో రేవంత్ ఒక్క ఇటుక పేర్చకుండా రూ.4లక్షల కోట్ల అప్పు చేశారని ధ్వజమెత్తారు. హైడ్రా పేరిట పేదల గుడిసెలు, ఇండ్లు కూల్చి వారిని రోడ్డున పడేసిన దుర్మార్గపు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

రైతుబంధు ఆగి పోయిందని, రాహుల్‌బంధు మాత్రం యదేచ్ఛగా సాగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక అవే ధాన్యం కుప్పలపై ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి.. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు బాకీపడ్డ రూ.75 వేలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోటీశ్వరుల మాట దేవుడెరుగు, లక్షాధికారులనైనా చేయాలన్నారు.