9 April, 2026 | 5:09 AM

రాసి పెట్టుకోండి.. ఏప్రిల్ 25

09-04-2026 12:38 AM

తెలంగాణ భవిష్యత్, చరిత్రను మార్చే రోజు

కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తాం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రాసిపెట్టుకోండి.. తెలంగాణ భవిష్యత్, చరిత్రను మార్చే రోజుగా ఈనెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు తాము ఏర్పాటు చేయబోయే పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురును, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుందన్నారు.

నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వెయ్యి మంది ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు. బుధవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత రంజిత్ సహా ఆయన అనుచరులకు కండు వా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము పెట్టబోయే పార్టీ ప్రజల కోసం కొత్త తరహా రాజకీయా లు చేస్తుందన్నారు. ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించటం ఇదే తమ పంథా అన్నారు.

రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేది ఎవరు అంటే ప్రతినోట జాగృతి అనే మాట వస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈనెల 25న పార్టీ ప్రకటన సందర్భంగా తమ ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామన్నారు. తెలంగాణ వస్తే స్వయంపాలన వస్తుందనుకుంటే ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేసే నేతలు వచ్చారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఫోన్ చేసినా కూడా రేవంత్‌రెడ్డి నిలబడే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.