9 April, 2026 | 5:10 AM

ఆస్పత్రి నిర్వహణ తీరు ఇలాగేనా?!

09-04-2026 12:41 AM

జిల్లా ఆస్పత్రి నిర్వహణపై భూపాలపల్లి ఎమ్మెల్యే ఆగ్రహం 

జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ఏప్రిల్ 8 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆసుపత్రి సూపరింటెండెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఆసుపత్రిని సందర్శించి, అన్ని విభాగాలను సమగ్రంగా పరిశీలించారు.

ఆసుపత్రిలోని క్యాజువలిటీ, ల్యాబ్ , ఏం.ఆర్.ఐ, ఔట్ పేషెంట్ గదులు పరిశీలించి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాజువాల్టీలో ఆరు మంచాలు మాత్రమే ఉన్నాయని, అత్యవసరంగా ఒకే సమయంలో ఎక్కువ మంది రోగులు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలుపగా నూతనంగా 15 మంచాలతో ఒక క్యాజువాల్టీ నిర్మాణం చేపడతామని, అంచనాలు తయారు చేసి ఇవ్వాలని టీ.జీ.ఎం.ఐ.డీ.సీ అధికారులను ఆదేశించారు.

అనంతరం ఆసుపత్రి ల్యాబ్ ను పరిశీలించి అన్ని రకాలైన పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, వార్డులు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలై ఆసుపత్రికి వస్తున్న రోగులకు ఇలాంటి పరిసరాలతో ఆరోగ్యం ఎలా కుదుటపడుతుందని ప్రశ్నించారు.

రోగులకు అందాల్సిన ప్రాథమిక సౌకర్యాలు సరిగా లేకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం వంటి అంశాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వహణపై బాధ్యత వహిస్తున్న పర్యవేక్షకుడిని ఇకముందు ఇలాంటి పరిస్థితి ఎదురైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, నిర్వహణ, సిబ్బంది సమయ పాలన  మెరుగుపరచాలని ఆదేశించారు.

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో పారిశుద్యాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, సిబ్బంది హాజరు, పనితీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఆసుపత్రి ఆవరణలోని మహిళా క్యాంటీన్ ను పరిశీలించి రోగి బంధువులతో మాటాడారు. క్యాంటీన్ లో పరిశుభ్రత తో కూడిన నాణ్యమైన వంటకాలను అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే క్యాంటీన్ లో టిఫిన్స్ రుచిచూశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.