20 June, 2026 | 1:40 AM

స్విట్జర్లాండ్‌లో చర్చలు రద్దు

20-06-2026 12:19 AM
  1. అమెరికా, ఇరాన్ కీలక భేటీకి బ్రేక్
  2. అధికారికంగా ప్రకటించిన వైట్‌హౌస్, ఇరాన్, స్విస్
  3. చివరి నిమిషంలో ఆగిన జేడీ వాన్స్ పర్యటన
  4. లెబనాన్‌పై మళ్లీ ఇజ్రాయెల్ దాడులే కారణం..
  5. తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి
  6. విడుదల కానున్న 165 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం
  7. భారత్‌తోపాటు అనేక దేశాలకు భారీ ఉపశమనం

వాషింగ్టన్/ టెహ్రాన్/స్విట్జర్లాండ్: అమెరికా మధ్య స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరగాల్సిన కీలక శాంతి చర్చలు హఠాత్తుగా రద్దయ్యాయి. శాంతి ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేసిన కొన్ని గంటలకే లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు చేసింది. ఈ నేపథ్యంలో చర్చలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని ఇరాన్ నిర్ణయించు కున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృదం స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉండగా.. చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకుంది.

ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రతినిధి రాత్రికి రాత్రే ప్రకటించింది. చర్చలు నిలిచిపోయినట్లు స్విస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది. ఒప్పందంలో భా గంగా ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాలన్న అమెరికా ప్రయత్నానికి తొలి అడుగులోనే ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా వైస్‌ప్రెసిడెంట్ తన బృందంతో కలిసి శుక్రవారం రాత్రి విమానంలో స్విట్జర్లాండ్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. వాన్స్ రాకకు ముందే వైట్‌హౌస్ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లో సమావేశమయ్యారు.

ఇంతలో ఇరాన్ పాన్ -అరబ్ శాటిలైట్ ఛానల్ అల్-మయాదీన్ నుంచి ప్రకటన వెలువడింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్య కారణంగా ఇరాన్ తన ప్రతినిధి బృందాన్ని స్విట్జర్లాండ్‌కు పంపడాన్ని ఆలస్యం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో వాన్స్ బృందం అమెరికాలోనే ఆగిపోవాల్సి వచ్చింది. అయితే చర్చ లు మళ్లీ ఎప్పుడు జరుగుతాయో తనకు తెలియదని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. తన పర్యటనను వాయిదా వేయడానికి కొన్ని గంటల ముందు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడారు.

ఈ వారాంతంలో చర్చలు జరుగుతాయో లేదో తనకు కచ్చితంగా తెలియదన్నారు. ‘మా ప్రణాళిక స్విట్జర్లాండ్ వెళ్లడం. కానీ అది ఎప్పుడో కచ్చితంగా తెలియదు’ అని వాన్స్ పేర్కొన్నారు. చర్చలు ఈ వారాంతంలో ప్రా రంభమవుతాయని మేము భావిస్తున్నాం. ఇప్పటికీ అదే ప్రణాళిక. కానీ అది మారవచ్చన్నారు. వాన్స్ మీడియాతో మాట్లాడిన కొద్దిసేపటికే, ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా మొజ్తబా ఖమేనీ అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఆమోదం తెలిపారు.   

ఇరాన్ నౌకలకు లైన్ క్లియర్.. ప్రారంభమైన హోర్ముజ్

అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఫలితంగా హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలకు లైన్ క్లియర్ చేస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రేవులు, తీరప్రాంతాల గుండా రాకపోకలు సాగించే సముద్ర ట్రాఫిక్‌పై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేసినట్లు అమెరికాసెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆంక్షలను అధికారికంగా రద్దు చేయడంతో ఇరాన్ నుంచి ముడిచమురు తీసుకెళ్తున్న నౌకలు, వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నాయి.

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం (ఎంఓయూ)తో హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది. దీంతో ఇంధన సరఫరాలో కీలకంగా ఉన్న హోర్ముజ్‌లో దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగిన అంతరాయానికి శుక్రవారం తెరపడింది. జలసంధిని తిరిగి తెరవడం వల్ల ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఉపశమనం లభించనుంది. గల్ఫ్ నుంచి నిలిచిపోయిన సుమారు 93 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్-యేతర ముడి చమురు విడుదల కానుందని కమోడిటీ డేటా సంస్థ క్లెప్లర్ అంచనా వేసింది.

వాషింగ్టన్ ఆంక్షలను మరింత సడలిస్తే, ప్రస్తుతం చాబహార్‌కు పశ్చిమాన ట్యాంకర్లలో నిలిచిపోయిన మరో 72 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చము రు కూడా విడుదల అవుతుంది. హోర్ముజ్‌పై ఆంక్షలు తొలగడంతో యూరప్, ఆసియాకు ఎగుమతులు మళ్లీ సజావుగా సాగడానికి వీలు కలిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన దిగుమతిదారులలో ఒకటైన భారత్‌కు ఈ పరిణామం గణనీయమైన ఉపశ మనాన్ని అందిస్తుంది. ఎందుకంటే.. భారత తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85 నుంచి -90 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది.

అందులో సుమారు సగం సరఫరా హోర్ముజ్ జలసంధి గుండానే అవుతుంటుంది. భారతదేశం తన మొత్తం డిమాండ్ లో దాదాపు 60 శాతాన్ని వంటగ్యాస్ అయిన ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)ను దిగుమతి చేసుకుంటుంది. అందులో సుమారు 90 శాతం రవాణా ఈ జలసంధి గుండానే అవుతుంది.

అలాగే -హోర్ముజ్ జలసంధి ద్వారా సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతర్ తమ ఇంధనాన్ని చైనా, భారత, యూరప్, ఆఫ్రికా దేశాల వర కు సజావుగా సరఫరా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ జలమార్గాన్ని పూర్తిగా తిరిగి తెరవడం వల్ల ఈ రెండు విషయాల్లోనూ ఉపశమనం లభిస్తుందని, వివిధ దేశాల్లో చమరు ధరలు పడిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి.