calender_icon.png 6 February, 2026 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌ను కాపాడేది బీజేపీయే.. వారిది ఫెవికాల్ బంధం

06-02-2026 01:54:31 AM

  1. బీఆర్‌ఎస్ వద్ద బీజేపీ ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నది
  2. కేంద్రం గాడిద గుడ్డు తప్ప అణా పైసా ఇవ్వలే 
  3. లెక్కలు చెప్తే గుండె పగిలి చస్తారు
  4. కేంద్రానికి దమ్ముంటే మున్సిపోల్స్‌లోపు కేసీఆర్‌ను అరెస్టు చేయాలి
  5. గుమ్లాపూర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

కరీంనగర్/చొప్పదండి, ఫిబ్రవరి 5  (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు తప్ప అణా పైసా ఇవ్వలేదని, 2014లో పోలవరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని ప్రధాని మోదీ మాట ఇచ్చి తప్పారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట సభలో ప్రసంగించారు.

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, ఇప్పటివరకు విచారణకు ఆదేశించలేదని, బీజేపీ, బీఆర్‌ఎస్‌లది ఫెవికా ల్ బంధమని అన్నారు. దమ్ముంటే మున్సిపల్ ఎన్నికల్లోపు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లను కాళేశ్వరం కేసులో అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ వద్ద బీజే పీ ప్రొటెక్షన్ మనీ తీసుకుంటుందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ ఎస్ నిలువెల్లా దోచుకున్నారని, రైతు లు, మహిళలు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ప్రజలు చీ కొట్టిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ‘అవయవదానం’ చేసి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసింది కూడా ఏమీ లేదని, మున్సిపల్ ఎన్నికలు రాగానే.. లావు మొనగాడు లడాయికి పోతే, ముగ్గురు మొనగాళ్లు ఎనుకనుంచి నూకినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడిని తీసుకువచ్చి ప్రచారం చేస్తున్నారని అన్నారు.

‘బడ్జెట్‌లో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాం.. తెలంగాణ ప్రజలకు మనకు ఓట్లు వేయరని.. ఆ నాయకునికైనా తెలియాలి కదా’ అని అన్నా రు. ప్రధాని మోదీ సహా ఢిల్లీలోని నా యకులందరినీ తెలంగాణకు తెచ్చినా బీజేపీ ఒక్క మున్సిపాలిటినైనా గెలుచుకోలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ఏటీఎంగా మార్చు కున్నారని గతంలో బీఆర్‌ఎస్‌పై మోదీ, అమిత్ షా అన్న మాటలు గుర్తులేవా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ఇక్కడి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కేసీఆర్, కేటీఆర్‌లకు లెక్కలు చెప్తే గుండె పగిలి చస్తారని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలకు చీకటి ఒప్పందం ఉందన్నారు. పదేళ్లలో రాష్ట్రానికి బీఆర్‌ఎస్, పన్నెండేళ్లలో బీజీపీ దేశానికి చేసినదానికంటే తాము రెండేళ్లలో ఎక్కువ చేశామని అన్నారు. 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఇందులో ఎవరికైనా అను మానం ఉంటే ఎల్బీ స్టేడియానికి రావాలని అక్కడ వివరంగా చెప్తానని సవాల్ విసిరారు.

‘ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాం, విద్యార్థుల కాస్మోటిక్ చార్జీలు పెంచాం, బ్రేక్ ఫాస్ట్ స్కీం తీసుకువచ్చాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, రైతులకు ఉచిత కరెంట్ ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే’నన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వని బీఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

వారి పాలనలో భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా స్టార్లు ఇలా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. అలాం టి మనుషులకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటేస్తే మన కళ్లను మన వేలితో పొడుచుకున్నట్లు అవుతుందని సీఎం అన్నారు.

గోదావరి పరివాహక దేవాలయాను అభివృద్ధిచేస్తాం..

2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ఆలయాలను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏకో టూరిజంను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం ఎన్నివేల కోట్లయినా ఖర్చు చేస్తామని తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి కేసీఆర్, కేటీఆర్, హరిశ్‌రావులు రాలేదని, పేదోళ్ల దేవుళ్లను మొక్కేందుకు వా ళ్లకు నామోషీ అన్నారు. బీఆర్‌ఎస్ ఎన్ని శాపనార్థాలు పెట్టినా మరో ఎనిమిదేళ్లు అధికారం మాదేనని, తెలంగాణను రాష్ట్రంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

అభ్యర్థులతో సమావేశమైన సీఎం..

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాజకీయాల్లో డబ్బులతో కాదు.. నమ్మకంతో గెలుస్తామని, ప్రజలకు నమ్మకం కలిగించండి.. అదొక్కటే మిమ్మల్ని గెలిపిస్తుందని సూచించారు. ఇవి కార్యకర్తల ఎన్నికలని, కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చినప్పుడే పార్టీ బలపడుతుందని అన్నా రు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు ముఖ్యమంత్రి సూచించా రు.ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం మాట్లాడారు.  

కరీంనగర్‌కు ఔటర్ రింగు రోడ్డు..

కరీంనగర్‌కు ఔటర్ రింగు రోడ్డు ను నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వరంగల్, కరీంనగర్‌లను జంట నగరాలుగా అభివృద్ధి చేసి రెండింటి మధ్య లో డంప్‌యార్డు ఏర్పాటుచేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. ‘బండి గుండు తెచ్చింది ఏమి లేదని, మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్లకు లేద’న్నారు. బండి సంజయ్ మాపై రంకెలు వేయ డం కాదు, కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసి కేసీఆర్ ను బొక్కలో వేయించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కరీంన గర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని.. మళ్లీ వస్తానని, కరీంనగర్ కా ర్పొరేషన్ను అభివృద్ధి చేస్తామన్నారు.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాష్ర్టంలో మరిన్ని డిగ్రీ కళాశాలలతోపాటు కళాశాలల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేశామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 70 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కుల గణన ద్వారా అన్నివర్గాలకు న్యాయం చేశారని, రైతులు, నేత కార్మికుల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు.