15 July, 2026 | 12:44 AM

ఖమ్మం గడ్డపై కాషాయ జెండా ఎగరడం తథ్యం

15-07-2026 12:44 AM
  1. మోదీ సుపరిపాలనతోనే ఖమ్మం అభివృద్ధి
  2. కాంగ్రెస్, కమ్యూనిస్టులవి అవకాశవాద రాజకీయాలు.
  3. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు.

వైరా, జులై 14(విజయక్రాంతి): దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల అవకాశవాద రాజకీయాలకు బలైపోయిన ఖమ్మం జిల్లాలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నేతలు శక్తివంచన లేకుండా పని చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ గౌతమ్ రావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ.. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, కమ్యూనిస్టుల అవకాశవాద రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఖమ్మం పోరాట గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు. కార్యక్రమం కు ముందు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు జిల్లా పార్టీ చేసిన కార్యాచరణ అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

అపవిత్ర కలయికతో పబ్బం గడుపుకుంటున్న కమ్యూనిస్టులు

దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్, కమ్యూనిస్టుల స్వార్థ రాజకీయాలకు బలైపోయిందని గౌతమ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక చైతన్యం ఉన్న ఈ గడ్డపై కార్మికులు, కర్షకుల పేరుతో రాజకీయాలు చేసిన కమ్యూనిస్టులు నేడు తమ సిద్ధాంతాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీల పేరుతో మోసం మంత్రుల ఆధిపత్య పోరు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని ఆరు గ్యారెంటీలతో ప్రజలను దారుణంగా మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గౌతమ్ రావు దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లా నుండి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకు ప్రజల సమస్యల పట్ల కనీస చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 

మోదీ సుపరిపాలనతోనే ఖమ్మం అభివృద్ధి

రాష్ట్రంలో ఇలాంటి వినాశకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ఖమ్మం జిల్లాకు ఏకైక ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమేనని గౌతమ్ రావు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, ఆ నిస్వార్థ అభివృద్ధి ఫలాలు ఖమ్మం గడపకు కూడా చేరుతున్నాయని వివరించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కుల మతాల మధ్య చిచ్చుపెట్టి చౌకబారు రాజకీయాలు చేస్తుంటే, బీజేపీ ’సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’ నినాదంతో ముందుకు సాగుతోందన్నారు.

దృఢమైన సంకల్పంతో, నిస్వార్థ ప్రజాసేవతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో ఈ పోరాట గడ్డపై కాషాయ జెండా సగర్వంగా ఎగరడం ఖాయమని గౌతమ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు వాకధాని పుల్లారావు యాదవ్, నంబూరి రామలింగేశ్వరరావు, సన్నీ ఉదయ ప్రతాప్, గోగూర వెంకటేశ్వర్లు, గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.