15 July, 2026 | 12:39 AM

వర్షపాతంపై దృష్టి పెట్టి సాగు చేయాలి

15-07-2026 12:39 AM
  1. రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరావు సూచన
  2. చిరుధాన్యాల సాగును పెంచాలిః ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ సత్యవతి

 హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు సాగు చేయాలని రాష్ట్ర - వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈ ఏడాది తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతోందని, కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

‘రైతు నేస్తం’ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం రైతులతో మాట్లాడారు. భూగర్భ జలాలపై అధికారులు రైతులకు సమాచారం అందించాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ, నీటిపారుదల  శాఖ, భూగర్భ జలాల శాఖ, భారత వాతావరణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు.

ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాల సాగును పెంచాలని సూచించారు. ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 30 నుంచి 35 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందన్నారు.

వచ్చే మూడునెలల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపీ, అధికారులు రాహుల్ రాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆల్తాస్ జానయ్య తదిరులు పాల్గొన్నారు.