బాగున్న సినిమాను భుజానమోసే గొప్ప గుణం తెలుగు ప్రేక్షకులది!
కార్తీక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాయవలస’. ఈ చిత్రాన్ని గోపీకృష్ణ జే నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. తాజాగా శుక్రవారం మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు హాజరైన యంగ్ హీరో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మ డైరెక్టర్‌గా, వాళ్ల నాన్న ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది. కార్తీక్‌కు ఇది పెద్ద స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నా.
సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు భుజాన వేసుకుని తీసుకెళ్తారు. ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అన్నారు. చిత్ర కథానాయకుడు కార్తీక్ మాట్లాడుతూ.. “నేను నా జీవితంలో ప్రేమించింది సినిమానే. ‘రాయవలస’ రియల్ లైఫ్ స్టోరీ. అందరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నా” అని చెప్పారు. ‘ఇది మంచి విలేజ్ డ్రామా. చాలా కొత్త కథతో వస్తోంది. నన్ను ఈ సినిమాలో రాణి పాత్రలో చూస్తారు’ అని హీరోయిన్ శ్రీష తెలిపింది.
దర్శకురాలు రాధిక జయంతి మాట్లాడుతూ.. “నేను చేసిన ‘మాయ’ చిత్రానికి యూఎస్‌లో మంచి ప్రశంసలు వచ్చాయి. ఒక తల్లిగా కొడుకుని లాంచ్ చేయడం చాలా పెద్ద విషయం. ఈ సినిమాతో ‘రాయవలస’ రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది” అన్నారు. ‘అందరూ ఈ చిన్న చిత్రాన్ని పెద్ద సినిమాగా చేయాలని కోరుకుంటున్నాన’ని నిర్మాత గోపీకృష్ణ చెప్పారు. కేఎల్ దామోదర్ ప్రసాద్, టీమ్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.






