ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
15వ రోజూ కొనసాగిన యుద్ధం
లెబనాన్‌పై వైమానిక దాడి
ఇరాన్‌లో 56 సాంస్కృతిక ప్రదేశాలు ధ్వంసం
కుర్దిస్తాన్ ప్రావిన్స్‌పై దాడుల్లో 110 మందికి పైగా మృతి
ఇరాన్‌లో దెబ్బతిన్న 43,000 పౌర యూనిట్లు
బీరుట్/టెహ్రాన్/తబ్రీజ్, మార్చి 14: యూఎస్- ఇరాన్ యుద్ధం శనివారం 15వ రోజుకు చేరింది. మధ్య ఆసియా దేశాల్లో ప్రాం తీయ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో మరణించిన వారి సంఖ్య 773కి పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్‌లోని తబ్రిజ్‌లోని ఒక పారిశ్రామిక జోన్‌కు ఇజ్రాయెల్ తరలింపు హెచ్చరికను కూడా జారీ చేసింది. ఇరాన్‌లో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 56 సాంస్కృతిక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి.
అలాగే 43,000 పౌరయూనిట్లు దెబ్బతిన్నాయి. కుర్దిస్తాన్ ప్రావిన్స్‌పై దాడుల్లో 110 మందికి పైగా మృతిచెందారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని ఒక కీలక వంతెనపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిందని, దీనివల్ల దక్షిణ నగరమైన నబాతియే, మర్జయూన్ పట్టణాల మధ్య రహదారి సంబంధం తెగిపోయిందని లెబనాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘నేషనల్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది.
శనివారం జరిగిన ఈ దాడి, అదే ప్రాంతంలో కేవలం కొన్ని గంటల వ్యవధి లోనే జరిగిన మూడో దాడి. దక్షిణ లెబనాన్‌లో మరో రెండు ప్రధాన వం తెనలపై దాడులు జరిగిన ఒక రోజు తర్వాత ఈ దాడి చోటుచేసుకుంది. బీరుట్ శివారులోని అపార్ట్మెంట్ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఉత్తర బీరుట్ శివారులోని బౌర్జ్ హమ్మౌద్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ భవనాన్ని ఇజ్రాయెల్ డ్రోన్ ఢీకొట్టింది. దీంతో భవనం ధ్వంసమై భారీ గొయ్యి ఏర్పండి. ఇజ్రాయెల్ దాడుల తర్వాత లెబనాన్ మరణాల సంఖ్య 770 కంటే ఎక్కువకు చేరింది.
లెబనాన్‌లో తాజా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 773కి పెరిగిందని స్థానిక అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. దక్షిణ లెబనాన్ దాడిలో హిజ్బుల్లా యోధులు మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. లెబనాన్‌లోని టైర్ జిల్లాలోని మజ్దల్ ప్రాంతంలోని రాకెట్ నిల్వ స్థలంపై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయని అల్ జజీరా తెలిపింది. ఈ దాడిలో యోధులు మరణించారని సైన్యం తెలిపింది. కానీ మృతుల సంఖ్యను పేర్కొనలేదు.
తబ్రిజ్‌లోని పారిశ్రామిక ప్రాంతానికి హెచ్చరిక
ఇరాన్‌లోని తబ్రిజ్‌లోని పారిశ్రామిక ప్రాంతానికి ఇజ్రాయెల్ తరలింపు హెచ్చరిక జారీ చేసింది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో తక్షణమే దాడులు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. కొనసాగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున నివాసితులు తమ భద్రత కోసం ఈ ప్రాంతాన్ని విడి చిపెట్టాలని, ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కోరారు.
కుర్దిస్తాన్ ప్రావిన్స్‌పై దాడుల్లో 110 మందికి పైగా మృతి
ఇరాన్‌లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్‌పై జరిగిన దాడుల్లో 110 మందికి పైగా మరణించారు.ఈ దాడుల్లో కనీసం 112 మంది మరణించగా, 969 మంది గాయపడ్డారని స్థానిక అత్యవసర అధికారి ఒకరు తెలిపారు. తాజా దాడుల తర్వాత డజన్ల కొద్దీ మంది ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ఐదుగురు రోగులతో సహా ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొన్నారు.
ఇరాన్‌లో 56 సాంస్కృతిక ప్రదేశాలు ధ్వంసం
అమెరికా- దాడుల్లో తమ దేశంలో 56 సాంస్కృతిక ప్రదేశాలు దెబ్బతిన్నాయని ఇరాన్ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎస్ దాడుల కారణంగా ఇరాన్‌లోని మ్యూజియాలు, చారిత్రక స్మారక చిహ్నాలు సహా కనీసం 56 సాంస్కృతిక ప్రదేశాలు ‘తీవ్రమైన నిర్మాణ నష్టాన్ని‘ చవిచూశాయని ఇరాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టెహ్రాన్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 19 చారిత్రక కట్టడాలు, కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లోని 12 ప్రముఖ ప్రదేశాలు దెబ్బతిన్నాయని ఇరాన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇరాన్‌లో దెబ్బతిన్న 43,000 పౌర యూనిట్లు
ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ అంతటా దాదాపు 43,000 పౌర యూనిట్లు దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ప్రభావితమైన నిర్మాణాల్లో 36,500 నివాస గృహాలు ఉన్నాయని, టెహ్రాన్‌లోనే దాదాపు 10,000 భవనాలు నమోదయ్యాయని ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ తెలిపారు. ఈ దాడుల్లో 43 అత్యవసర విభాగాలు, 32 అంబులెన్స్‌లు, 120 పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి. కనీసం 223 మంది మహిళలు మరణించార ని, మృతిచెందిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య 206కు పెరిగిందని ఇరాన్ అధికారులు తెలిపారు.




