నాలుగో కుర్చీకి ఇంకా రాజకీయ ‘వాస్తు’ కుదరలే!?
హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఏకాభిప్రాయం వచ్చాకే చివరి సభ్యుడి ఎంపిక అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, మే 13 (విజయక్రాంతి): హుస్నాబాద్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక రాజకీయ రంగుల మధ్య అర్ధాంతరంగా ముగియడంతో పట్టణ రాజకీయాల్లో మరోసారి అంతర్గత అసమ్మతి చర్చనీయాంశమైంది. నాలుగు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సిన చోట ముగ్గురితోనే కార్యక్రమాన్ని ముగించేయడం చూస్తే, అధికార పార్టీకి మెజారిటీ ఉన్నా... మనసులు మాత్రం మైనారిటీలోనే ఉన్నాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, వాటిలో 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందగా, 4 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిపత్యం ఉన్నప్పటికీ, కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో మాత్రం ఒక కుర్చీ అధికార పార్టీకే కంటి మీద కునుకు లేకుం డా చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి ఎన్నికలు అధికార పార్టీకి కేవలం ఒక ఫార్మాలిటీగానే భావిస్తా రు. కానీ హుస్నాబాద్లో మాత్రం ఆ ఫార్మాలిటీనే రాజకీయ ఫైటింగ్కు వేదిక కావడం ఆసక్తికరంగా మారింది.
నాలుగు స్థానాలకు గాను కేవలం ముగ్గురిని మాత్రమే ఎన్నుకోవడం వెనుక తీవ్ర భిన్నాభిప్రాయాలు ఉ న్నాయన్న ప్రచారం పట్టణ రాజకీయ వర్గా ల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పున్న లా వణ్య, ఎండి హసన్ లాల్, భూక్య సరోజనలను కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోగా, నా లుగో స్థానాన్ని మాత్రం ’తర్వాత చూద్దాం’ అన్నట్టుగా ఖాళీగా ఉంచడం రాజకీయ చర్చలకు తావిస్తోంది.
ఒక్క కుర్చీ కోసం ఇంత తర్జన భర్జన అంటే... లోపల లెక్కలు ఎంత ఘర్షణాత్మకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు ’ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మిగిలిన ఒక కో-ఆప్షన్ సభ్యుడిని ఎంపిక చేస్తాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం కూడా చర్చనీయాంశమైంది.
రాజకీయవర్గాలు మాత్రం దీనిపై వ్యం గ్యంగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ చేతిలో ఉండి కూడా ఏకాభిప్రాయం కోసం ఎదురు చూడాల్సి వస్తే... అది ప్రజాస్వామ్య పరిపక్వతా? లేక అంతర్గత పోరాటాల ప్రతిబింబమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రి మాట్లాడుతూ, హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యు లు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
అయితే నాలుగో సభ్యుడి ఎంపిక విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయ ని, అందరూ ఒకే మాటపైకి వచ్చిన తర్వాత ఆ స్థానాన్ని కూడా భర్తీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లిఖార్జున్ రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇక పట్టణ ప్రజలు మాత్రం వ్యంగ్యంగా, ముగ్గురిని ఎన్నుకోవడానికి ఓ సమావేశం... నాలుగో వ్యక్తిని ఎన్నుకోవడానికి మరో సమావేశం... ఇదేనా కొత్త రాజకీయ సమన్వయం? అంటూ చర్చించుకుంటున్నారు.






