శీతల బస్టాప్స్..!
మండు వేసవిలో నిండు చల్లదనం
ఒకపక్క భగభగ మండుతున్న ఎండలు, మరోపక్క తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. చల్లచల్లగా గాలి వీస్తే ఎలా ఉంటది.. నీటి తుంపరలు దేహాలను తడుముతుంటే ఎంత హాయ్ అనిపిస్తది.. కదా..! అబ్బా.. ఎంత చల్లదనమో.. అనుకుంటూ సేదతీరాలినిపిస్తుంది కదా.. అలాంటి కూల్..కూల్.. బస్టాప్స్ ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా.. నిజమేనండి.. నమ్మితీరాల్సిందే..! పదా.. ఆ బస్టాం డ్లు ఎక్కడ ఉన్నాయో.. అందులో చల్లదనం.. సంగతలు తెలుసుకుందాం.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో శీతల బస్టాండ్‌లు ఉన్నాయి. హనుమకొండలోని పెట్రోల్ పంప్, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఇటీవలనే శీతల బస్టాప్‌లను ఏర్పాటు చేశారు. అందంగా తయారు చేసిన ‘మిస్ట్’ శీతల బస్టాప్‌ల్లో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా పై కప్పు నుంచి సన్నటి నీటి తుంపరలు పడుతూ.. చల్లదనాన్ని అందిస్తున్నాయి. పైన ఉన్న వెదురు తడకలపై నుంచి ప్రత్యేకంగా అమర్చిన మోటార్ల పైపుల ద్వారా చిన్నచిన్న నీటి తుంపరలు పడుతుంటాయి.
దీంతో బస్‌స్టాప్‌తో పాటు పరిసరాల్లో 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి బస్టాప్‌లో ఉన్న ప్రజలకు శీతల వాతావరణం ఏర్పడుతుంది. మూడు రోజులుగా వరంగల్ నగరంలో 46 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరగడంతో పాటు వడగాలులు వీస్తున్నాయి. వాటి నుంచి రక్షణగా ప్రయాణికులకు ఈ ‘మిస్ట్’ బస్టాప్‌లలో చల్లదనాన్ని ఇస్తున్నాయి. ప్రయాణికు లకు చల్లదనాన్ని ఇచ్చే ఈ బస్టాపులను గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు.
బండి సంపత్ కుమార్,
మహబూబాబాద్, విజయక్రాంతి






