డీటీవో మృతిపై విచారణ
భూపాలపల్లిలో ఘటన స్థలాన్ని పరిశీలించిన ట్రాన్స్‌పోర్టు కమిషనర్
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), జూన్ 24 (విజయక్రాంతి): భూపాలపల్లి ఆర్డీవో ఆఫీస్ వద్ద ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన డీటీవో ఎం వెంకన్న మృతిపై విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్‌ను విచారణ అధికారిగా నియమించింది. బుధవారం చంద్రశేఖర్‌గౌడ్ భూపాలపల్లికి వెళ్లి, సమగ్ర విచారణ చేపట్టారు. ఘనపూర్ పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు.
పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను సీఐ కరుణాకర్‌రావు, ఎస్‌ఐ అశోక్‌లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత లారీ డ్రైవర్‌ను, లారీ ఓనర్, హార్వెస్టర్ డ్రైవర్‌ను విచారించారు. జెన్ కో అధికారులతో సమావేశమై ఆ రోజు లారీలో రవాణా చేసిన బొగ్గు వివరాలు తెలుసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురు ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి సంఘటన జరిగిన పరిస్థితులను విశ్లేషించారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. బొగ్గు లోడింగ్ పాయింట్ అయిన తాడిచర్ల కు వెళ్లి అక్కడ ఓపెన్ కాస్ట్ ప్రతినిధులతో సమావేశమయ్యి ఆరోజు ఆ లారీ లోడ్ రికార్డులను పరిశీలించారు.






