19 March, 2026 | 10:59 AM

అర్హులకు అందని ఇందిరమ్మ ఇళ్లు..

19-03-2026 01:20 AM

సభలో గళమెత్తిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

షాద్‌నగర్, మార్చి 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’ఇందిరమ్మ ఇళ్లు’ పథకం క్షేత్రస్థాయిలో అర్హులకు అందడం లేదని, ప్రభుత్వ హామీలు కేవలం ఉపన్యాసాలకే పరిమితమవుతున్నాయని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా, నిష్పక్షపాతంగా ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు.

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలం ఎదిర గ్రామానికి చెందిన ఊరడి లక్ష్మిక్రిష్ణయ్య ముదిరాజ్ అనే వ్యక్తి పరిస్థితిని ఎమ్మెల్సీ సభ దృష్టికి తీసుకెళ్లారు.లక్ష్మిక్రిష్ణయ్యకు ఉండటానికి ఇల్లు లేక, ఉన్న పాత ఇల్లు కూలిపోవడంతో ఊరికి దూరంగా ఉన్న కొద్దిపాటి పొలంలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారని తెలిపారు.అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు.

మంత్రి పొంగులేటికి డిమాండ్..

ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నవీన్ రెడ్డి కోరారు. సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, లక్ష్మిక్రిష్ణయ్య లాంటి నిరుపేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.