భారత్ ఏ జట్టుకు షాక్
- ఆప్ఘనిస్థాన్ ఏ సంచలన విజయం
- డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో గెలుపు
- భారీస్కోరు చేసినా ఓడిన భారత్ ఏ
దంబుల్లా, జూన్ 11 : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్ ఏ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారీస్కోరు చేసినా వర్షం కారణంగా ఆప్ఘనిస్థాన్ ఏ జట్టు చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆప్ఘన్ విజయా న్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రభ్ సిమ్రన్ సింగ్ మెరుపు ఆరంభాన్నిచ్చా రు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై నిరాశపరిచిన చిచ్చర పిడుగు వైభవ్ ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు.
కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లకో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్‌తో కలిసి వైభవ్ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలో 74 పరుగులు జోడిం చా రు. కాసేపటికే ప్రియాన్ష్ ఆర్య (8) కూడా ఔటవడంతో భారత్ ఏ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ప్రభ్ సిమ్రన్, రుతురాజ్ గైక్వాడ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 79 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సెంచరీ చేస్తాడనుకున్న ప్రభ్ సిమ్రన్ 69 బంతుల్లో 84 (14 ఫోర్లు) పరుగులకు వెనుదిరిగాడు.
తర్వాత రుతురాజ్, కెప్టెన్ తిలక్ వర్మ ఇన్నిం గ్స్ కొనసాగించారు. తొలి మ్యాచ్‌లో లంకపై కీలక పార్టనర్ షిప్ సాధించిన వీరి జోడీ మరోసారి సత్తా చాటింది. 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.రుతురాజ్ గైక్వా డ్ 66(3 ఫోర్లు), తిలక్ వర్మ 66 (5 ఫోర్లు) పరుగులు చేయగా.. ఆయుశ్ బదోనీ (0) నిరాశ పరిచాడు. తర్వాత సూర్యాన్ష్ షెగ్దే ధా టిగా ఆడి 40 పరుగులు చేయగా.. చివర్లో భారత్ ఏ వరుసగా వికెట్లు కోల్పోయింది. మధ్యలో వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో భారత్ ఏ 9 వికెట్లకు 349 పరుగులు చేసింది. ఆప్ఘన్ బౌలర్లలో అబ్దుల్లా 5 , సఫి 3 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యఛేదనలో ఆప్ఘనిస్థాన్ ఏ కూడా ధీటుగానే స్పందించింది.
ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. కెప్టెన్ ఇమ్రాన్ మీర్, హసన్ తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. హసన్ (34)ను అర్షద్ ఖాన్ ఔట్ చేయగా, తనీవాల్(2) ను అంకుల్ రాయ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత బహీర్ షా, కెప్టెన్ ఇమ్రాన్ మీర్ మూడో వికెట్‌కు అజేయమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 108 పరుగులు జోడించారు. అయితే 25.5 ఓవర్లలో 177/2 పరుగుల స్కోర్ దగ్గర భారీ వర్షం అడ్డుపడింది. దీం తో అంపైర్లు డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో ఆప్ఘనిస్థాన్ గెలిచినట్టు ప్రకటించారు.
స్కోరు బోర్డు
భారత్ ఏ ఇన్నింగ్స్ : 349/9 (ప్రభ్‌సిమ్రన్ సింగ్ 84, రుతురాజ్ 66, తిలక్ వర్మ 66 ; అబ్దుల్లా 5/68, సఫీ 3/85)
ఆప్ఘనిస్థాన్ ఏ ఇన్నింగ్స్ : 177/2 (25.2 ఓవర్లు) (ఇమ్రాన్ మీర్ 75 నాటౌట్, హస్సన్ 34, బహీర్ షా 51 నాటౌట్; అర్షద్‌ఖాన్1/38, అంకుల్ రాయ్ 1/24)






