3 April, 2026 | 3:09 AM

వేగం పెంచండి

03-04-2026 01:25 AM
  1. ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 
  2. స్కిల్స్ వర్సిటీని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలి
  3. విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూడు రోజుల క్రితం కేరళంకు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. గురువారం సాయంత్రం శంషాబాద్ ఏయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడినుంచి ముచ్చర్ల ప్రాంతంలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీని సందర్శించారు.

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెం ట్ అథారిటీ కార్యాలయ భవననిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న కీలక ప్రాజెక్టుల పురోగతిపై సంబం ధిత అధికారులతో ఆయన సమీక్షించారు. అథారిటీ భవనసముదాయం, ఆ ప్రాంతం మాస్టర్ ప్లాన్ డిజైన్లను మ్యాప్‌ల ద్వారా పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ నగరాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీపడకూడదని అధికారులకు సూచించారు. ఆ తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్సిటీ పనులను కూడా సీఎం పరిశీలించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటుచేస్తున్న యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ భవనసముదాయాలను వేవగంతంగా పూర్తిచేయాలన్నారు.

యూనివర్సిటీకి సంబంధించిన అకడమిక్ బ్లాకులు, వర్క్ షాపులు ఇతర వసతుల నిర్మాణ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించి, నిర్ణీత కాలవ్యవధిలోగా పనులన్నీ పూర్తిచేసి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పనులను మూడు షిఫ్టుల్లో జరిగేలా చూడాలని పేర్కొన్నారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు,  జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.