3 April, 2026 | 3:06 AM

ఘనంగా శోభా యాత్ర జై వీర హనుమన్ కి!

03-04-2026 01:45 AM

గౌలిగూడలో జెండా ఊపి ప్రారంభించిన సీపీ సజ్జనార్

  1. ఉదయం 11.30 గంటలకు ప్రారంభం
  2. రాత్రి 8 గంటలకు తాడ్‌బండ్ హనుమాన్ ఆలయానికి..
  3.   12 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర
  4. జై హనుమాన్, జై బజరంగ్ నినాదాలతో మార్మోగిన రోడ్లు
  5. మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన శోభా యాత్ర కనుల పండువగా సాగింది. గౌలిగూడ రామాలయం నుంచి ప్రారంభమైన యాత్ర 12 కి.మీ.ల మేర సాగి రాత్రి ౮ గంటలకు తాడ్‌బండ్‌లోని హనుమాన్ ఆలయానికి చేరింది. హనుమాన్ జయంతి సందర్భంగా పలు ఆలయాల్లో భక్తులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు.

గౌలిగూడ రామమందిరంలో సీపీ సజ్జనార్ పూజలు చేసిన అనంతరం వీర హనుమాన్ విజయ యాత్రను ఉదయం 11:30 గంటలకు కాషాయ జెండా ఊపి ప్రారంభిం చారు. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు 12 కిలోమీటర్ల మేర ఈ విజయయాత్ర సాగింది. దాదాపు 3 వేల మంది పోలీసులతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు.

గౌలిగూడ రామ మందిరం నుంచి పుత్లిబౌలి క్రాస్‌రోడ్స్, కోఠి ఆంధ్రా బ్యాంక్ క్రాస్‌రోడ్స్, డిఎం అండ్ హెచ్‌ఎస్ సర్కిల్, కాచిగూడ క్రాస్‌రోడ్స్, వైఎంసిఏ నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్, కావడిగూడ, ఘాస్‌మండి, బాటా క్రాస్‌రోడ్స్, ఎంజీ రోడ్, ప్యారడైజ్, సీటీఓ క్రాస్రోడ్స్, బాలమ్‌రాయి మీదుగా తాడ్‌బండ్‌కు చేరింది.యాత్రలో భక్తులు జై శ్రీరామ్, జై బజరంగ్ బలీ, జై హనుమాన్ నినాదాలతో భక్తిని చాటుకున్నారు. హనుమాన్ చాలీసా పఠనం, సింధూర అర్చన, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు.

వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా నగర వ్యాప్తంగా 168 ర్యాలీలు నిర్వహించారు. కర్మన్‌ఘాట్ ఊరేగింపుతో సహా 14 ఉప ఊరేగింపులు, 92 చిన్న ఊరేగింపులు ఉన్నాయి. ఆయా మార్గాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉన్నాయి. వివిధ హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు,స్థానిక భక్తి సంఘాలు, ఆలయ కమిటీలు ఆధ్వర్యంలో శోభాయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు.

పలు ఆలయాల్లో జయంతి వేడుకలు..

సికింద్రాబాద్/ఎల్బీనగర్/ముషీరాబాద్/శేరిలింగంపల్లి/సనత్‌నగర్/జూబ్లీహిల్స్(విజయక్రాంతి): అమీర్‌పేట్‌లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనత్‌నగర్‌లో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భోలక్‌పూర్ హనుమాన్ దేవాలయం, ఐడీహెచ్ కాలనీలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించి పూజలు నిర్వహించారు. రామస్వామి కాంపౌండ్, బన్సీలాల్ పేట వ్యాయామశాల, జబ్బార్ కాంప్లెక్స్ బస్ స్టాప్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.

తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లి  హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ పూజలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ చిక్కడపల్లిలోని ఆంజనేయ స్వామిని దర్శించుకు న్నారు. హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక పూజలు చేశారు. అంబర్పేట నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రత్యేక పూజలు చేశారు. 

సామాన్యులు యాత్రలో.. బార్లలో బడా బాబులు

హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడగా, స్టార్ హోటళ్లు, క్లబ్బులు, బార్లు యథావిధిగా నడవటం చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అమలు చేసిన మద్యం నిషేధం నిర్ణయం కొన్ని వర్గాలకే పరిమితమైంది. పోలీసు నిబంధనల ప్రకారం నగరంలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే సాధారణ బార్లను మూసివేశారు. సామాన్య జనం, మధ్యతరగతి ప్రజలు శోభాయాత్రలో పాల్గొంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోగా.. మరోవైపు సంపన్న వర్గాలు, వ్యాపారవేత్తలు మాత్రం బార్లు, క్లబ్బులో ఎంజాయ్ చేశారు.