స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ వెనక్కి.. మతలబు ఏంటి?
- ఇది ప్రజా ప్రభుత్వమా.. లేక ‘ప్రైవేట్’ కంపెనీయా?
- చేనేత కార్మికుల పొట్ట కొడుతున్న రేవంత్ సర్కార్
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఇది ప్రజా ప్రభుత్వమా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండి పడ్డారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు వత్తాసు పలకడమేనా ప్రజా పాలన? అని ప్రశ్నించా రు. 2026--27 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల తయారీకి ఇచ్చిన రూ. 105.54 కోట్ల ఆర్డర్‌ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యాశాఖ చేనేత శాఖకు లేఖ రాసింది.
ఇప్పటికే సంక్షేమ శాఖలు రూ. 200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీ కోసం గడువు ముగిసినా ఆర్డర్ ఇవ్వకపోవడంతో టెస్కో ఆందోళన చెందుతోంది. ఈ నిర్ణయంపై తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గురువారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిం చారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి రేవంత్ సర్కార్ చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతోందని మండిపడ్డారు.
రూ. 105 కోట్ల విలువగల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక మతలబు ఏంటి? అని ప్రశ్నిం చారు. సంక్షేమ శాఖ నుండి టెస్కోకు దక్కాల్సిన రూ. 200 కోట్ల దుస్తులు, దుప్పట్ల ఆర్డర్ ఇంకా ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కమీషన్లు దండుకోవాలనే యావలో ప్రైవేట్ వ్యక్తులకు ఆర్డర్లు ఇస్తున్నది కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా. నేతన్నల ఉసురు పోసుకుంటున్న కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు.




